హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవీశరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా ఐదోరోజు గురువారం శ్రీలలితా మహాత్రిపుర సుందరిగా అమ్మవారిని అలంకరించారు. ఆలయ అర్చకులు భద్రకాళిశేషు ఆధ్వర్యంలో వేద పండితులు నిత్యాహ్నికం, చతుఃషష్టి ఉపచార పూజలు జరిపి చండీహోమం నిర్వహించారు. అమ్మవారి స్నపనమూర్తికి ఉదయం స్కందమాత క్రమంలో పూజలు జరిపి ఉత్సవమూర్తికి పల్లకీసేవ, సాయంత్రం దుమ్రహాక్రమంలో పూజలు జరిపి శేషవాహనంపై ఊరేగించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు జరుపుకున్నారు. వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్, వేములవాడ శ్రీరారాజేశ్వరస్వామి దేవాలయం ఈఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం..
సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సమక్షంలో ఈఓ రామల సునీత.. దేవాలయ చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యం, ఎక్స్ ఆఫీషియో మెంబర్ పార్నంది నర్సింహమూర్తి, ధర్మకర్తలతో ప్రమాణ స్వీకారం చేయించారు.


