నిధుల్లేక.. నీరసించి! | - | Sakshi
Sakshi News home page

నిధుల్లేక.. నీరసించి!

Jun 20 2026 12:36 PM | Updated on Jun 20 2026 12:36 PM

మూడేళ్లుగా నిలిచిపోయిన ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఫండ్స్‌

దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు పేదలకు ఆరోగ్య భాండాగారాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాల కల్పన కోసం ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నిధులు విడుదల చేస్తుంది. అయితే, మూడేళ్లుగా ఆ నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఆయా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కరువు అయ్యాయి.

జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు

జిల్లా వ్యాప్తంగా 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 4 కేంద్రాలు 24 గంటలు, 10 కేంద్రాలు 12 గంటలు సేవలందిస్తాయి. వాటికి అనుబంధంగా గ్రామాల్లో 118 ఆరోగ్య ఉప కేంద్రాలు (సబ్‌ సెంటర్లు) ఉన్నాయి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏటా రూ.1.50 లక్షలు, ఆరోగ్య ఉపకేంద్రానికి ఏటా రూ.10 వేల చొప్పున జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. కాగా, చివరిసారిగా 2023 మార్చిలో నిధులు విడుదల చేసింది. మూడేళ్లుగా ఎలాంటి నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఆస్పత్రుల నిర్వహణ అటకెక్కింది. కనీస సౌకర్యాలు లేక పేదల ఆరోగ్య కేంద్రాలు విలవిలలాడుతున్నాయి.

ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులతో 14 కార్యక్రమాలు

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 14 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాతాశిశు మరణాల రేటు తగ్గింపు చర్యలు, గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమం, కీటక జనిత వ్యాధుల నివారణ, సార్వత్రిక వ్యాధి నిరోదక సేవలు, క్షయ, కుష్ఠు వ్యాధి నివారణ చర్యలు, మరణాల తగ్గింపు, అసంక్రమిత వ్యాధుల నివారణ, పారిశుద్ధ్యం, మలేరియా, డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపడతారు. నిధులు రాకపోవడంతో ఆరోగ్య కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడింది.

కనుమరుగైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణ కోసం నిధుల కొరత ఏర్పడింది. ఆపరేషన్‌ చేయించుకున్న వారికి పురుషులకు రూ.1,100, సీ్త్రలకు రూ.800 చొప్పున ప్రోత్సాహకాలు అందజేయాల్సి ఉంది. నిధులు లేక కుటుంబ నియంత్రణ శిబిరాలే ఏర్పాటు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. జనని సురక్ష, శిశుయోజన కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకున్న వారికి మందుల కొనుగోలు కోసం ఒక్కో కేసులో రూ.1600, భోజనానికి రోజుకు రూ.100 చొప్పున మూడు రోజుల పాటు చెల్లించాలనే నిబంధన ఉంది. నిధులు లేని కారణంగా అవి ఇప్పుడు అటకెక్కాయి.

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

గ్రామాల్లో ప్రతి ఐదు వేల జనాభాకు ఒకటి చొప్పున ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులు రూ.10 వేల చొప్పున అందచేయాల్సి ఉంది. వాటితో సబ్‌సెంటర్‌లో పారిశుద్ధ్య పనులు చేపట్టేవారు. మూడు సంవత్సరాలుగా ఉప కేంద్రాలకు సైతం నిధులు రావడం లేదు. దీంతో చెత్తాచెదారం పేరుకుపోయింది.

పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలో కరువైన కనీస వసతులు

రోగులకు అందని మెరుగైన వైద్యసేవలు

ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణపై తీవ్ర ప్రభావం

మూడేళ్లుగా నిధులు నిలిచిపోయాయి

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద ప్రభుత్వం ప్రతినెలా పీహెచ్‌సీలకు నిధులు విడుదల చేసేది. 2023లో విడుదల చేసిన అనంతరం మళ్లీ నిధులు రాలేదు. 2024, 2025, 2026 ఆర్థిక సంవత్సరాలకు చెందిన బకాయిలు రావాల్సి ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కాస్త ఇబ్బందిగా మారింది. చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఆస్పత్రుల వైద్యులు సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సమస్యను జిల్లా ఉన్నతాఽధికారులకు నివేదించాం.

– ప్రకాశ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement