సంగెం: ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న నిరుపేదలకు వచ్చిన ఉద్యోగావకాశాన్ని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తిమ్మాపూర్ ఎంపీపీఎస్‌లో 2026 – 27వ సంవత్సరానికి ప్రీప్రైమరీ పాఠశాలలో ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు ఈనెల 19వ తేదీన తుది గడువుతో అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఆయా పోస్టు కోసం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పల్లకొండ మౌనిక దరఖాస్తు చేసుకోవడానికి తాను చదువుకున్న జెడ్పీహెచ్‌ఎస్‌కు వెళ్లి తన 7వ తరగతి మార్కుల జాబితా కావాలని కోరింది. పాఠశాలలో 2009 – 10కి సంబంధించిన మార్కుల రికార్డులు లభించలేదు. ఆ ఏడాది 7వ తరగతిలో 33 మంది చదువుకోగా వారికి సంబంధించిన అడ్మిషన్ రిజిస్టర్, హాజరు రిజిస్టర్ అన్ని లభించినప్పటికీ మార్కుల రికార్డులు లభించకపోవడంతో రికార్డులు లభించడం లేదని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధికారికంగా రాసిచ్చారు. అప్పటి ప్రధానోపాధ్యాయులు చేసిన పొరపాటు వల్ల తనకు ఉద్యోగం రాకుండా పోయిందని, న్యాయం చేయాలని బాధితురాలు మౌనిక వేడుకుంటున్నారు. కాగా, బాధితురాలు 10వ తరగతి వరకు ఆ పాఠశాలలోనే చదివి పాస్ అయింది.
నిర్లక్ష్యంగా రికార్డుల నిర్వహణ
మండలంలోని సోమ్లాతండాలోని ఎంపీపీఎస్‌లో 2008 – 09లో పాఠశాలలో చేరిన 14 మంది విద్యార్థులు చేరగా, వారు జన్మించిన సంవత్సరం 2003కాగా వారందరు 2002లోనే పాఠశాలలో జాయిన్ అయినట్లుగా అప్పటి ప్రధానోపాధ్యాయులు నమోదు చేశారు. అడ్మిషన్ రిజిస్టర్‌లో విద్యార్థుల ఇంటిపేరు లేకుండానే రాసుకున్నారు. అప్పటి విద్యార్థిని పూజ.. స్టడీ సర్టిఫికెట్ కోసం వెళ్లగా ఇటీవల ఈ విషయం వెల్లడైంది. ఇలా నిర్లక్ష్యంగా రికార్డులు నమోదు చేయడం వల్ల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుటి ప్రధానోపాధ్యాయులు ఉన్నది ఉన్నట్లు సర్టిఫై చేస్తామని, మార్చలేమని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సంగెం మండలంలో రెండు ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డుల్లో తప్పులు దొర్లడం, రికార్డులు లేకపోవడంతో మిగతా పాఠశాలల్లో రికార్డుల పరిస్థితి ఏంటని పూర్వ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రికార్డుల నిర్వహణను సరిచేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో లేని సమాచారం
రికార్డులు లభించకపోవడంతో ప్రీప్రైమరీ ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుద్యోగి
పుట్టిన సంవత్సరం కంటే ముందుగానే పాఠశాలలో చేరినట్లుగా, ఇంటి పేర్లు లేకుండానే రిజిస్టర్లలో నమోదు


