వెపన్‌.. ఫ్యాషన్‌..! | - | Sakshi
Sakshi News home page

వెపన్‌.. ఫ్యాషన్‌..!

Jun 16 2026 1:34 AM | Updated on Jun 16 2026 1:34 AM

వెపన్‌.. ఫ్యాషన్‌..!

నక్సల్స్‌ భయం పోయినా...

తుపాకుల హవా

ఉమ్మడి వరంగల్‌లో 380 వరకు గన్‌ లైసెన్స్‌లు ఉన్నట్లు అంచనా

భద్రత ముసుగులో సెటిల్‌మెంట్లు.. దారి తప్పుతున్న ఆయుధాలు

పోలీసుల ఫోకస్‌... లైసెన్స్‌దారుల్లో చర్చనీయాంశం

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

..ఇలాంటి ఘటనల్లో కొన్ని కేసులు నమోదు కాకున్నా చాలావరకు ఫిర్యాదులున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఒకప్పుడు దేశంలోనే అత్యంత సున్నితమైన నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి ప్రజాప్రతినిధులపై మావోయిస్టుల హెచ్చరికలు, కాంట్రాక్టర్లపై దాడులు, వ్యాపారవేత్తలనుంచి లెవీలు, రాజకీయ నాయకుల హత్యలు, భద్రతా సిబ్బందిపై దాడులు తరచూ చోటుచేసుకునేవి. ఆ భయానికి వరంగల్‌ నగరానికి వచ్చి తలదాచుకున్న వారు చాలామందే ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే పెద్దఎత్తున ఆయుధాల లైసెన్సులు జారీ అయ్యాయి. గతంలో ప్రాణ భద్రత కోసం తీసుకున్న ఈ ఆయుధాలు ఇప్పుడు అవసరానికంటే ప్రతిష్టకు, ప్రభావానికి, కొన్నిచోట్ల భూ వివాదాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు, సెటిల్‌మెంట్లలో ఒత్తిడి సాధనంగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ఆయుధాల లైసెన్సులపై సమగ్ర సమీక్షకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పుడు స్టేటస్‌ సింబల్‌గా ‘గన్‌’..

గత దశాబ్ద కాలంగా తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. అనేకమంది ఎన్‌కౌంటర్లలో చనిపోగా చాలావరకు లొంగిపోయారు. మైదాన ప్రాంతాలు, అడవుల్లో పూర్తిగా కదలికలు తగ్గి పోలీస్‌ ఆధిపత్యం పెరిగింది. తెలంగాణలో పూర్తిగా అంతరించిపోయిందని ప్రభుత్వం, డీజీపీలు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఆయుధాల అవసరం ఎంత మేర ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకప్పుడు గన్‌ అంటే భద్రత. ఇప్పుడు కొంతమంది వద్ద అది ‘స్టేటస్‌ సింబల్‌‘గా మారిందనే విమర్శలున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, లేఅవుట్‌ నిర్వాహకులు, భూముల కొనుగోలు విక్రయదారులు, సెటిల్‌మెంట్‌ ముఠాలకు దగ్గరగా ఉండే వ్యక్తులు కొంతమంది ఆయుధాలను తమ ప్రభావం చూపేందుకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతుండడం చర్చనీయాంశం అవుతోంది.

డీజేపీ ఆదేశాలు.. ఆయుధాలపై ఆరా

అధికారిక గణాంకాల ప్రకారం ఆయుధాల లైసెన్సులు ఉమ్మడి వరంగల్‌ నుంచి 380 వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఆయుధాలు దారితప్పుతున్నాయన్న ఫిర్యాదులపై డీజీపీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. లైసెన్సు పొందిన కారణాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయా? లైసెన్సుదారులపై క్రిమినల్‌ కేసులున్నాయా? ఆయుధాల దుర్వినియోగం జరుగుతోందా? రద్దు చేయాల్సిన లైసెన్సులు ఉన్నాయా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేకంగా... నక్సల్స్‌ ప్రభావం తగ్గిన తర్వాత భద్రతా ముప్పు లేని వ్యక్తులు, వ్యాపార రంగం మారిన వారు, జిల్లా విడిచి వెళ్లిన వారి వద్ద ఉన్న లైసెన్సులపై పునఃపరిశీలన చేస్తుండడం లైసెన్స్‌పొందిన వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఓ వ్యాపారవేత్త ఓ ఫంక్షన్‌హాల్‌లో గాలిలోకి కాల్పులు జరిపిన ఘటన అప్పట్లో వివాదాస్పదంగా మారింది. రాజకీయపరమైన చర్చ ముదిరి గాల్లోకి కాల్పులు జరిపే వరకు వెళ్లడాన్ని సీరియస్‌గా భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ రౌడీషీటర్‌ గతేడాది గ్రేటర్‌ సిటీ గోపాల్‌పూర్‌ ఏరియా, శాయంపేట మండలాల్లో గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. భూసెటిల్‌మెంట్లు, ఓ హత్యకు ప్లాన్‌ చేశారన్న ఫిర్యాదులపై పోలీసులు అరెస్టు చేసి రెండు కంట్రీ రివాల్వ ర్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్‌ నగరంలో ఓ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి భూముల పంచాయితీ సందర్భంగా తనవద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ తుపాకీని టేబుల్‌ పెట్టడం వివాదంగా మారింది. తనను బెదిరించే ప్రయత్నం చేశారన్న ప్రత్యర్థి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement