హన్మకొండ చౌరస్తా: మాతా, శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే తగిన చర్యలు తప్పవని హనుమకొండ డీఎంహెచ్‌ఓ రాంకుమార్ హెచ్చరించారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఆదివారం సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ వివరించారు. ప్రసవం కోసం వచ్చిన, ప్రసవించిన మహిళలతో ఆయన మాట్లాడారు. వారికి పీహెచ్‌సీ స్థాయిలో ఆశలు, ఏఎన్‌ఎంలు, వైద్యాధికారుల ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు? 102 వాహన సౌకర్యాలు వినియోగించుకుంటున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హాల్‌లో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ ఇసంపెల్లి జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
నేడు వరంగల్ కలెక్టరేట్‌లో..
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నలుమూలల వచ్చే ప్రజల సమస్యల పరిష్కారం కోసం అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
విద్యారణ్యపురి: పీఆర్సీ ఈనెలాఖరులోపు ప్రకటించకపోతే ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధం కావాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌కుమార్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 జూలై 1 నుంచి పీఆర్సీ అమలు చేయడం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు డి.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఈహెచ్‌ఎస్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రవీందర్‌రాజు, జిల్లా జనరల్ సెక్రటరీ పెండెం రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.రాజారాం, జిల్లా కార్యదర్శులు సీహెచ్.లింగారావు, సీఎస్‌ఆర్ మల్లిక్, బాధ్యులు పి.చంద్రయ్య, జి.భాస్కర్‌రావు, బ్రహ్మచారి పాల్గొన్నారు.
న్యూశాయంపేట: విద్యార్థులకు చదువుతోపాటు నైతిక విలువలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలంగాణ రాష్ట్ర హజ్‌కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా అన్నారు. వరంగల్ ఎల్‌బీనగర్‌లోని విజ్‌డమ్ హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన దువాయే నిషిష్త్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత పెడదారి పట్టకుండా ఉండాలంటే ఆధ్యాత్మిక విద్య అవసరమని పేర్కొన్నారు. సాంకేతిక విద్య మనిషికి జీవనోపాధిని ఇస్తే.. ఆధ్యాత్మిక విద్య మనిషి ఎలా బతకాలో నేర్పుతుందన్నారు. విజ్‌డమ్ గ్రూఫ్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ ఖమర్ అలీబేగ్ అధ్యక్షతన జరిగిన సదసస్సులో డాక్టర్ అనీస్ అహ్మద్ సిద్ధిఖీ, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్, బీఆర్‌ఎస్ నాయకుడు సయ్యద్ మసూద్, సోయబ్‌బాబా, మౌలనా ఫసియొద్దీన్ ఖాస్మీ, సయ్యద్ సుభానుద్దీన్, మిర్జా జాఫర్ అలీబేగ్, మిర్జా అమీర్‌అలీ బేగ్, మహ్మద్ సిరాజ్ అహ్మద్, మతపెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


