ఖానాపురం: మూగజీవాల అక్రమ రవాణాను అడ్డుకున్న ఖానాపురం ఎస్సై రామ్మోహన్‌ను సీపీ సన్‌ప్రీత్‌సింగ్ గురువారం అభినందించారు. ఇటీవల మూగజీవాల ముఠాను సాహ సం చేసి పట్టుకోవడంలో ప్రతిభ కనబరించారు. దీంతో ప్రశంసపత్రంతో పాటు నగదు పురస్కారాన్ని ఎస్సైకి సీపీ అందజేశారు. డీసీపీ అంకిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేసవి శిబిరాలను విజయవంతం చేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో వేసవి శిబిరాల విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శిబిరాల నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 10 వరకు నిర్వహించనున్న శిబిరాల్లో పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీఓ నాగపద్మజ, అదనపు డీఆర్‌డీఓ రేణుక, డీపీఓ కల్పన, సంక్షేమాధికారి రాజమణి తదితరులు పాల్గొన్నారు.
జాబ్‌మేళా ఏర్పాట్ల పరిశీలన..
హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పలు కంపెనీలు రానున్నాయని కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నిరుద్యోగ యువత వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
బల్దియా కార్యాలయంలో కరపత్రాల కలకలం
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో గురువారం పలు అంశాలతో కూడిన కరపత్రాలు కలకలం రేపాయి. తెలంగాణలో రెండో పెద్ద నగరానికి పూర్తిస్థాయి కమిషనర్, ఎస్‌ఈ, సీపీల ఇన్‌చార్జ్ పాలన ఇంకా ఎన్నాళ్లు అంటూ పత్రాల్లో పేర్కొన్నారు. గ్రీవెన్స్ దరఖాస్తులను గాలికి వదిలేస్తున్నారని, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, పన్నుల విభాగంలో పైసలిస్తే పనులు చేస్తున్నారని వాటిలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని, పూర్తి స్థాయి అధికారులను నియామించాలని వివరించారు. కాగా, పాలకవర్గం పదవీకాలం ముగిసిన మరుసటి రోజే ప్రత్యేకాధికారిగా చాహత్ బాజ్‌పాయ్ బాధ్యతలు తీసుకున్నారు. అదే రోజు ప్రత్యక్షమైన ఈ కరపత్రాలపై బల్దియా అధికారులు, ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
మహిళ ఆత్మహత్య
సంగెం: పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్గూర్‌స్టేషన్ శివారు చిలుకమ్మ తండాకు చెందిన గుగులోత్ దేవి (55), నర్సింహ దంపతులకు ఇద్దరు కుమారులు వెంకన్న, భాస్కర్ ఉన్నారు. భాస్కర్, నరసింహ మరణించారు. వెంకన్నకు 1.20 వ్యవసాయ భూమి ఉంది. ఇటీవల వెంకన్న తన కూతురు నందిని వివాహం చేయడానికి 10 గుంటల భూమిని అదే తండాకు చెందిన వీరన్నకు విక్రయించాడు. భూమి ఎందుకు అమ్ముతున్నావని దేవి కొడుకు వెంకన్నతో గొడవపడింది. మనస్తాపం చెందిన ఆమె బుధవారం రాత్రి గడ్డి మందు తాగి కోడలు కవితకు విషయం చెప్పింది. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి దేవి మృతి చెందినట్లు తెలిపారు.


