కమనీయం.. వీరభద్రుడి కల్యాణం
● స్వామి నామస్మరణతో మార్మోగిన ఆలయం
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శనివారం వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్ల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ బొజ్జపురి అశోక్ ముఖర్జీ, ఈఓ కిషన్‌రావు, తదితర సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను కల్యాణ మండపంలోకి తీసుకొచ్చారు. ఆగమ పండితులు యాగ్నికుల చేతుల మీదుగా కల్యాణోత్సవాన్ని కనులకు ఇంపుగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని కనులారా తిలకించారు. కార్యక్రమంలో ‘కుడా’ డీసీసీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఆలయ అర్చకులు రాజయ్య, రాంబాబు, వినయ్‌శర్మ, రమేశ్, శ్రీకాంత్, సందీప్ తదితరులు ఉన్నారు.
కమనీయం.. వీరభద్రుడి కల్యాణం


