హెచ్‌పీవీతో క్యాన్సర్‌కు చెక్
బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణకు వ్యాక్సిన్
గీసుకొండ: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల్లో గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ రాకుండా ముందుగానే కట్టడి చేసేందుకు ఆ శాఖ సిద్ధమవుతోంది. అందుకోసం జిల్లాలో 14 సంవత్సరాలు నిండిన కిశోర బాలికలకు ‘హ్యూమన్ పాపిలోమా వైరస్’ (హెచ్‌పీపీ) టీకా ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బందికి టీకాపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. బాలికల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా ఖరీదైన ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇవ్వనున్నారు. బయట ప్రైవేట్‌గా కొని వేసుకోవాలంటే ఒక్కో వ్యాక్సిన్ ధర రూ.10 వేలకు పైగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్య మహిళతో క్యాన్సర్ కేసులు
వెలుగులోకి..
2023 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుంచి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో ఎంపిక చేసిన పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో మహిళలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేడానికి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మహిళల్లో రొమ్ము, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కేసులను గుర్తించి వారికి తగిన రీతిలో చికిత్సలు అందించే విధంగా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. పలు రకాల క్యాన్సర్ కేసులు కొంత మేరకు ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యాధికారులు పరీక్షల ద్వారా నిర్ధారిస్తున్నారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా సోకుతుంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్నేళ్ల పాటు వృద్ధి చెంది క్యాన్సర్‌కు కారణం అవుతుంది. ఈ క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తించలేకపోవడంతో వ్యాధి చివరిదశలో బయటపడి మరణానికి దారి తీసే పరిస్థితి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం బాలికలకు ఉచితంగా వేయాలని నిర్ణయించింది. టీకా జిల్లాకు రాగానే గుర్తించిన బాలికలకు వేయనున్నారు.
14 ఏళ్లు నిండిన వారికి టీకా..
14 ఏళ్లు నిండిన బాలికలను గుర్తించి హెచ్‌పీవీ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వేస్తారు. ఈ టీకా ఇచ్చే విషయంలో ఇప్పటికే వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వం హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత జిల్లాలో కార్యక్రమాన్ని చేపడతాం. వేరే దేశాల్లో టీకా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించేందుకు ఉచితంగా టీకా అందించడానికి ముందుకు వచ్చింది.
– డాక్టర్ ప్రకాశ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, డీఐఓ
14 ఏళ్లు నిండిన వారికి త్వరలో ఉచితంగా టీకా
జిల్లాలో సుమారు 9 వేల మంది బాలికలు ఉన్నట్లు అంచనా
గ్రామాల్లో సర్వే చేస్తున్న
ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు
ఇప్పటికే వైద్యులు, సిబ్బందికి శిక్షణ పూర్తిచేసిన అధికారులు
బాలికల గుర్తింపు కోసం సర్వే
జల్లాలో 14 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి 15 ఏళ్ల వయస్సు దాటని కిశోర బాలికలను గుర్తించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సిద్ధం అవుతోంది. ఇందుకోసం గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే బాలికలతోపాటు పనిచేసుకునే వారిని గుర్తించే ప్రక్రియ చేపడుతున్నారు. పీహెచ్‌సీల వారీగా శిక్షణ పొందిన వారు సబ్‌సెంటర్లు, గ్రామాల్లో ఆశ, ఏఎన్‌ఎంల ద్వారా సర్వే చేస్తారు. సేకరించిన వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. ఇంటింటి సర్వే ద్వారా అర్హులైన బాలికల లెక్క తేలనుంది. జిల్లాలో సుమారు 9 వేల మంది బాలికలు 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు వారు ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది.
హెచ్‌పీవీతో క్యాన్సర్‌కు చెక్


