అభ్యంతరాలు ఉంటే తెలపండి
న్యూశాయంపేట: జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే తెలపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశహాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో ముసాయిదా ఓటరు జాబితా రూపొందించామన్నారు. డిసెంబర్ 31న డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసి అన్ని మున్సిపాలిటీల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు జరిపామన్నారు. వచ్చిన ప్రతీ అంశాన్ని పరిశీలిస్తూ వాటిని పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 8వ తేదీ లోగా తెలపాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి ఈ నెల 10న తుది ఓటరు జాబితా వెలువరిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మున్సిపల్ కమిషనర్లు సుధీర్‌కుమార్, భాస్కర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు హరిశంకర్, సయ్యద్ ఫైజుల్లా, రజనీకాంత్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


