ఐలోని మల్లన్న క్షేత్రానికి రండి
జాతర బ్రహ్మోత్సవాలకు సీఎంను
ఆహ్వానించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
ఐనవోలు: శతాబ్దాల చరిత్ర కలిగి, ప్రఖ్యాత శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చి సంక్రాంతి నుంచి ప్రారంభమయ్యే జాతర బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్‌రెడ్డిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆహ్వానించారు. సోమవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఈ నెల 13 నుంచి ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు సీఎం రేవంత్‌కు వివరించారు. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మతో కూడిన శ్రీమల్లికార్జునస్వామి చిత్రపటాన్ని జాతర ఆహ్వాన పత్రికను రేవంత్‌రెడ్డికి అందించారు. అర్చకులు పాతర్లపాటి నరేశ్, శ్రీనివాస్ సీఎం రేవంత్‌కు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, ఈఓ కందుల సుధాకర్ స్వామి వారి శేషవస్త్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో నందనం సర్పంచ్ రాజు, మహ్మద్ చోటే తదితరులు పాల్గొన్నారు.


