ఎక్కడి సమస్యలు అక్కడే
న్యూశాయంపేట: రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలు ఉన్నప్పుడన్నా ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేవి.. జిల్లాల పునర్విభజన అయిన తర్వాత ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయని, అధికారులు ముప్పుతుప్పలు పెడుతున్నారని నల్లబెల్లి మండలం మంచుప్పులకు చెందిన రిటైర్డ్ ఎంఈఓ ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. తన భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మ్యుటేషన్ పెండింగ్ సమస్య, పట్టాదారు పాస్ బుక్కు కోసం అధికారులు తిప్పించుకుంటున్నారని కలెక్టర్ సత్యశారద, అధికారుల ఎదుట ఆవేదన వెల్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులకు సూచించారు.
సమస్యలు త్వరగా పరిష్కరించాలి:కలెక్టర్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం మొత్తం 151 దరఖాస్తులు స్వీకరించారు. అందులో రెవెన్యూశాఖకు సంబంధించి 59, జీడబ్ల్యూఎంసీ 20, డీఆర్‌డీఏ, డీపీఓ 11, వివిధ శాఖలకు సంబంధించినవి 50 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. భూ సమస్యలు, ఫించన్లు, గృహలు, ఉపాధి, సంక్షేమ పథకాలపై వచ్చిన వినతులను వెంటనే పరిశీలించి అర్హత మేరకు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీడబ్ల్యూఓ రాజమణి, ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
వినతులు ఇలా..
● రోల్లకల్లు, నారాయణపురం గ్రామాల్లో శివాలయం పక్కనే పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. దీంతో శివాలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, పల్లె ప్రకృతి వనాలను వేరే చోటికి తరలించాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు కోరారు.
● ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యానికి డబ్బులు రాలేదని గన్నారం గ్రామానికి చెందిన రైతులు విన్నవించారు.
నా భూమి నాకు అప్పగించాలి
ఏ లాభం లేకుండా పాఠశాలను నడుపుతానంటే తన భూమిని ఇల్లందులోని ఓ వ్యక్తికి దానం చేశాను. ప్రస్తుతం ఆ పాఠశాల నడిపించకుండా మూసి వేసి, ఆయా స్థలాన్ని విక్రయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని వెంటనే ఆపాలి. అట్టి భూమిని ప్రభుత్వ అవసరాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న.
– జి.ఉపేంద్రశాస్త్రి, ఇల్లంద
తిండి పెట్టడం లేదు
వృద్ధాప్యంలో ఉన్న తనకు తిండి పెట్టడం లేదు. నా కుటుంబ సభ్యులు బాగోగులు పట్టించుకోవడం లేదు. సీనియర్ సిటిజన్ యాక్టు నమోదు చేసి నాకు న్యాయం చేయాలి. ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు.
– ఎం.సత్యనారాయణ, నెక్కొండ
ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడన్నా..
పనులు జరిగేవి..
కలెక్టర్ ఎదుట ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
కలెక్టర్ సత్యశారద
గ్రీవెన్స్‌లో 151 అర్జీలు
ఎక్కడి సమస్యలు అక్కడే
ఎక్కడి సమస్యలు అక్కడే


