
రైల్వే ఇన్‌స్టిట్యూట్ నిర్వహణ భేష్
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహణ సూపర్‌గా ఉందని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డాక్టర్ ఆర్.గోపాల్‌కృష్ణన్ అన్నారు. కాజీపేట జంక్షన్‌లో పలు విభాగాలను ఆదివారం ఆయన తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించి, రైల్వే రన్నింగ్ రూంలో డ్రైవర్లకు కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కాజీపేట రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ కోర్టును ఏడీఆర్‌ఎంతో కలిసి ప్రారంభించారు. అనంతరం రైల్వే ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన రెండు క్యారం బోర్డులు ప్రారంభించారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్ కమిటీని అభినందించి నిర్వహణ బాగుందని పేర్కొన్నారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్, రైల్వే కమ్యూనిటీహాల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధికి కేటాయించిన ఎస్‌బీఎఫ్ ఫండ్‌ను మంజూరు చేయాలని, రైల్వే కమ్యూనిటీహాల్‌కు మరో డైనింగ్‌హాల్ నిర్మాణం చేయాలని, ఏసీని మరమ్మతు చేయాలని, జనరేటర్‌ను మంజూరు చేయాలని, కుషన్ స్టీల్ చైర్లు, కావాల్సిన సామగ్రి ఇప్పించాలని కమిటీ బాధ్యులు వినతిపత్రం సమర్పించారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో నూతన భవనంతోపాటు జిమ్‌కు సంబంధించిన సామగ్రి ఏర్పాటు చేయాలని, ఇన్‌స్టిట్యూట్‌లో నూతనంగా టాయిలెట్స్ నిర్మించాలని డీఆర్‌ఎంను కోరారు. కార్యక్రమంలో ఎలక్ట్రిక్ లోకోషెడ్ సీనియర్ డీఈఈ సూర్యనారాయణ, రైల్వే అధికారులు ప్రశాంతకృష్ణసాయి, సుధీర్‌కుమార్, ఎన్వీ వెంకటకుమార్, టి.అనికేత్‌కాడే, ప్రంజల్ కేశర్‌వాణి, రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, దేవులపల్లి రాఘవేందర్, కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
డీఆర్‌ఎం గోపాలకృష్ణన్