
వేతన బాధలు తీరేనా..?
దుగ్గొండి: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమయానికి వేతనాలు అందక కష్టాలు పడుతున్నారు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి వేతనాలు అందిస్తుండడంతో ఆర్థికంగా కుటుంబ జీవనం కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రెజరీల ద్వారా కాకుండా కేంద్రీకృత విధానం ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అక్రమాలకు అస్కారం లేకపోగా కార్మికులకు మేలు జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని 11 గ్రామీణ మండలాల పరిధిలో 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్ద గ్రామంలో 8 మంది చిన్న గ్రామాల్లో ఇద్దరు పనులు చేస్తున్నారు. ఒక్కో కార్మికుడికి ప్రభుత్వం రూ.9,500 వేతనం అందిస్తుంది. ప్రతిరోజూ డ్రెయినేజీలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం, మంచినీటిని సరఫరా, దోమల నివారణ చర్యలు, పంచాయతీ కార్యాలయంలోని వివిధ రకాల పనులు చేయడం వీరి విధి. గత ఏడాదిన్నర కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీల్లో నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా కార్మికులకు ప్రతినెలా వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పుడు పంచాయతీ కార్యదర్శులు ట్రెజరీలకు బిల్లులు పంపి వేతనాలు చెల్లించారు. ఇదే తరుణంలో కేంద్రీకృత విధానం అమలు చేయాలని, టీజీ బీపాస్ ఖాతాల ద్వారా కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో డీపీఓలకు ఉత్తర్వులు అందాయి. ఇకనుంచి అనధికారికంగా పారిశుద్ధ్య కార్మికుల నియామకం, వేతనేతర ఖర్చుల కింద పంచాయతీ కార్యదర్శులు నిధులు డ్రా చేసుకునే అవకాశం లేదు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నూతన విధానాలను అమలు చేయనున్నారు.
ఇక నుంచి టీజీ బీపాస్ పద్ధతిలో..
ఏప్రిల్, మే, జూన్ నెలలకు పారిశుద్ధ్య కార్మికులు నిధులు మంజూరయ్యాయి. ఇక నుంచి ప్రతినెలా వేతనాలు టీజీ బీపాస్ పద్ధతిలో అందించే విధంగా చర్యలు తీసుకుంటాం.
–కల్పన, జిల్లా పంచాయతీ అధికారి
నూతన విధానం కొనసాగించాలి
నూతన విధానం ద్వారా వేతనాలు ఇవ్వడం ద్వారా కష్టాలు తీరుతాయనే నమ్మకం ఉంది. గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక నుంచి ప్రభుత్వం ఇబ్బందులు లేకుండా చూడాలి.
–పుట్టపాక రాజేందర్,
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న
పారిశుద్ధ్య కార్మికులు
నెలల తరబడి పెండింగ్
తాజాగా విడుదల చేస్తూ జీఓ జారీ