‘స్థానిక’ం తర్వాతే.. | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ం తర్వాతే..

Aug 4 2025 3:08 AM | Updated on Aug 4 2025 3:08 AM

‘స్థానిక’ం తర్వాతే..

‘స్థానిక’ం తర్వాతే..

సాక్షిప్రతినిధి. వరంగల్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి కేడర్‌ కదిలించేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల, బ్లాక్‌, జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు వేయాలని మొదట భావించింది. ఏప్రిల్‌ 24 నుంచి జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌ల ద్వారా సమావేశాల ఏర్పాటు చేసి ఆశావహుల పేర్లను కూడా సేకరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ బాధ్యతలు చేపట్టడం.. పార్టీ పరంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో సంస్థాగత కమిటీల ప్రస్తావన మరుగున పడింది. ఇప్పుడు నామినేటెడ్‌ పోస్టుల భర్తీతోపాటు సంస్థాగత కమిటీలపై చర్చ జరుగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్పులు, చేర్పులు మంచిది కాదన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రస్థాయి కమిటీలకు డైరెక్టర్ల కోసం మాత్రం ఎమ్మెల్యేల ద్వారా పేర్లను సేకరించారు.

పదవులకు ప్రామాణికం 2017 కటాఫ్‌..

మహిళలకు ప్రాధాన్యం

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ హైదరాబాద్‌లో ఇటీవల ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్‌ నుంచి జిల్లా ఇన్‌చార్జ్‌, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతోపాటు సంస్థాగత, నామినేటెడ్‌ పదవులపైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 24 మంది పేర్లను ఎమ్మెల్యేలు సూచించాల్సి ఉంది. వరంగల్‌ అర్బన్‌ ప్రాంతాల్లో రెండింటితో సరిపెట్టలేమని, ఐదు వరకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలిస్తామన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి డైరెక్టర్లతోపాటు జిల్లాస్థాయి నామినేటెడ్‌ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని, 2017 సంవత్సరం కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్‌ నాయకులకు కూడా మొదటి దఫాలోనే అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కష్టపడే నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నదని, ప్రజాప్రతినిధులు సీనియర్లను ఎంపిక చేయాలని మీనాక్షి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో సీనియర్లు, ఆశావహులు పదవుల కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

పరిశీలనలో ఉన్న డీసీసీ ఆశావహుల పేర్లు ఇవే...

వాస్తవానికి జిల్లా కాంగ్రెస్‌ కమిటీలను మే వరకు నాటికి పూర్తి చేయాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు ఏప్రిల్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీల నియామకానికి జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించింది. మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావించి కసరత్తు చేశారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సంస్థాగత కమిటీలు వేయాలని అధిష్టానం భావిస్తే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను మరోసారి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్‌, ఇనుగాల వెంకట్రాం రెడ్డి, పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. వరంగల్‌ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చినా.. రాజకీయ సమీకరణలు మారితే నమిండ్ల శ్రీనివాస్‌, గోపాల నవీన్‌రాజ్‌, కూచన రవళిరెడ్డి పేర్లు వినిపించాయి. మహబూబాబాద్‌ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్‌చందర్‌రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, నునావత్‌ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, డోర్నకల్‌, మహబూబాబాద్‌, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్‌, మురళీనాయక్‌తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. జయశంకర్‌ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్‌, చల్లూరి మధు తదితరుల పేర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. ఈయనను మార్చితే హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్‌ ధన్వంతి పేర్లు పరిశీలించారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌కే మళ్లీ అవకాశమన్న ప్రచారం జరుగగా.. మంత్రి ధనసరి సీతక్క కుమారుడు సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్‌, బాదం ప్రవీణ్‌ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

డీసీసీలకు కొత్త సారథులు!?

బ్లాక్‌, మండల అధ్యక్షులు కూడా యథాతథం

పునరాలోచనలో పార్టీ అధిష్టానం

నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి ఓకే..

త్వరలో డైరెక్టర్‌ పోస్టుల నియామకం

అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు..

నగరాల్లో ఐదు కావాలన్న ఎమ్మెల్యేలు

ఇటీవలే ఉమ్మడి జిల్లాల

ప్రజాప్రతినిధులతో సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement