
ముల్కనూరు సహకార సంఘం సేవలు భేష్
ఎల్కతుర్తి : ముల్కనూరు సహకార డెయిరీ నిర్వహణ, సహకార గ్రామీణ పరపతి సంఘం అందజేస్తున్న సేవలు బాగున్నాయని కలెక్టర్ స్నేహశబరీష్ కితాబిచ్చారు. గురువారం భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు మహిళా డెయిరీ, సహకార సంఘాన్ని కలెక్టర్ సందర్శించారు.డెయిరీని ప్రారంభించిన తీరు, పెట్టుబడి, వనరులు, పాల సేకరణ, క్వాలిటీ, పరిశీలన, రవాణా సదుపాయాలు, ప్రాసెసింగ్, లాభ,నష్టాలు, డెయిరీ పనితీరు, బిల్లుల చెల్లింపులు, పాల నాణ్యత పరీక్షించే విధానం, పాల ప్యాకెట్ల తయారీ తదితర అంశాలను డెయిరీ జీఎం భాస్కర్ రెడ్డిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ముల్కనూరు సహకార సంఘాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడి రైతులతో ముచ్చటించారు. బ్యాంక్ అందజేస్తున్న సేవలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను జీఎం రామ్‌రెడ్డి, సీనియర్ మేనేజర్ వెంకటేశ్వర రావులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముల్కనూరు సహకార సంఘం అభివృద్ధిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వీక్షించారు. సహకార రంగంలో దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్న మహిళా డెయిరీ, సహకార సంఘం ప్రతినిధులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పరకాల మహిళా డెయిరీని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ముల్క నూరు డెయిరీని సందర్శించినట్లు ఆమె తెలిపారు. డీఆర్‌డీఓ మేన శ్రీను, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీఓ వీరేశం, ఎంఈఓ సునీతారాణి, ఏఓ పద్మ, ఏపీఎం దేవానంద్, ఏపీఓ కుమారస్వామి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ స్నేహశబరీష్
సహకార బ్యాంక్, డెయిరీల సందర్శన

ముల్కనూరు సహకార సంఘం సేవలు భేష్