పంటలకు గోదావరి జలాలు అందిస్తాం..
ధర్మసాగర్: వానాకాలంలోగా ఎత్తిపోతల పథకం పైపులైన్ పనులు పూర్తి చేసి ధర్మపురం రైతుల పంటలకు గోదావరి జలాలు అందిస్తామని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండలంలోని ధర్మపురంలో ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. ఇప్పటికే ధర్మపురం గ్రామానికి 25 ఇళ్లు మంజూరు చేశానని, త్వరలోనే మరో 25 ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకం ద్వారా నష్కల్ నుంచి వంగాలపల్లి వరకు పైపులైన్ పనులను పూర్తి చేసి వర్షాకాలం వరకు పంట పొలాలకు సాగునీరు అందిస్తామని, పైపులైన్ ఏర్పాటుకు రైతులు సహకరించాలని కోరారు. ఇప్పటికే గ్రామంలో ముదిరాజ్, యాదవ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి మంజూరు ఇచ్చానని, వాటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్సీ కాలనీలో శ్మశానవాటికకు ప్రహరీ, బోర్‌వెల్, స్నానపు గదులను మంజూరు చేస్తానని అన్నారు. అలాగే గ్రామంలో మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి 15 రోజుల్లో మంజూరు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ మునిగాల యాకూబ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే
కడియం శ్రీహరి


