
ఫాలో అప్ సేవలందించాలి
కమలాపూర్: ప్రసవం అనంతరం తల్లులకు ఏడాది పాటు ఫాలో అప్ సేవలందించాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి వంగపల్లి, మర్రిపల్లిగూడెం గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను, ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి గుండేడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారికి అందిస్తున్న సేవలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. వంగపల్లిలో నిర్మాణం పూర్తయిన ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని పరిశీలించారు. వంగపల్లిలో ఒకరు, మర్రిపల్లిగూడెంలో ఇద్దరు, గుండేడులో ఒకరు ఇటీవల ప్రసవించగా.. వారి ఇళ్లకు వెళ్లి తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి నాగరాజు, వైద్యులు సంయుక్త, హెల్త్ సూపర్‌వైజర్లు వెంకటరమణారెడ్డి, థామస్, అమృత, సిబ్బంది సరోజ, ప్రేమలత, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ అప్పయ్య