ఉద్యమ నేతకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ నేతకు అవకాశం

Apr 13 2024 1:30 AM | Updated on Apr 13 2024 1:30 AM

వరంగల్‌ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ - Sakshi

వరంగల్‌ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

రంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఎట్టకేలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. రిజర్వ్‌ నియోజకవర్గం అయిన వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌కుమార్‌ను శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌కు చెందిన ముఖ్యనేతలతో చర్చించిన మీదట సుధీర్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. హనుమకొండ జిల్లా వాసి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్‌కుమార్‌ ప్రస్తుతం హనుమకొండ జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

ముఖ్య నేతలతో భేటీ తర్వాతే ప్రకటన..

బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌) ఆవిర్భావం తర్వాత 2001 నుంచి మాజీ మంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో సుఽధీర్‌కుమార్‌ తెలంగాణ ఉద్యమంలో చురుకై న పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా ఉంటూ అధినేత కేసీఆర్‌తో కలిసి పనిచేస్తున్నారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తుకు సిద్ధమైన కేసీఆర్‌.. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధర్మారెడ్డి తదితరులతో ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో భేటీ అయ్యారు. అందరితో చర్చించి వారి సూచనల మేరకు అధినేత కేసీఆర్‌.. సుధీర్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌లో పదవులు..

టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన సుధీర్‌కుమార్‌.. మాజీ ఎంపీ, దివంగత సింగాపురం రాజేశ్వర్‌రావు, కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు నాయకత్వంలో పనిచేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ఆయన అనేక పదవులు నిర్వహించారు. తొలుత 1995లో హనుమకొండ జిల్లా(పూర్వ కరీంనగర్‌ జిల్లా) ముల్కనూరు ఎంపీటీసీగా విజయం సాధించి భీమదేవరపల్లి మండల పరిషత్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో భీమదేవరపల్లి జెడ్పీటీసీగా గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఎల్కతుర్తి జెడ్పీటీసీగా గెలుపొందిన సుధీర్‌కుమార్‌ హనుమకొండ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అదేపదవిలో కొనసాగుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ, అనుబంధ సంఘాలకు సంబంధించిన పలు రాష్ట్రస్థాయి పదవులు సైతం నిర్వహించారు.

సామాజికంగా ఎదుర్కోవడానికి..

ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాకు చెందిన సుధీర్‌కుమార్‌.. మాదిగ సామాజికవర్గానికి చెందిన నేత. అయితే కడియం శ్రీహరి, అరూరి రమేష్‌ను ఎదుర్కోవాలంటే క్షేత్రస్థాయిలో మంచి ఫాలోయింగ్‌, పలుకుబడి ఉన్న నేత అయితేనే కరెక్ట్‌ అని భావించిన కేసీఆర్‌.. సుధీర్‌కుమార్‌ పేరును ప్రకటించినట్టు తెలుస్తోంది. కాగా తనపై నమ్మకంతో వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, ఇతర పెద్దలకు పేరు పేరునా డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, అన్ని వర్గాల ప్రజలు నిండుమనసుతో ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు.

ఫాంహౌస్‌లో హైడ్రామా..

లోక్‌సభ ఎన్నికల సమయంలో వరంగల్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య.. పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ మరో అభ్యర్థిని ప్రకటించడం అనివార్యంగా మారింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ వరంగల్‌ అభ్యర్థి ఎంపిక సందర్భంగా ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలతోపాటు శుక్రవారం ఉదయం కేసీఆర్‌ నుంచి మాజీ మంత్రి తాటికొండ రాజయ్యకు కూడా పిలుపు వచ్చింది. అయితే అక్కడికి చేరిన రాజయ్య పరిస్థితులను గమనించి కాసేపటి తర్వాత వెళ్లిపోయారు. వరంగల్‌ జిల్లాకు చెందిన కీలక నేతలతో కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించిన అనంతరం వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా సుధీర్‌కుమార్‌ పేరు ఖరారు చేశారు. కాగా.. చివరి నిమిషం వరకు తాటికొండ రాజయ్య పేరు ప్రచారంలో ఉంది. టికెట్‌ తనకే వస్తుందని ఆశించిన తాటికొండ రాజయ్య మరోసారి నిరాశకు గురయ్యారు.

బీఆర్‌ఎస్‌ వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా సుధీర్‌కుమార్‌

మాదిగ సామాజికవర్గం వైపే

కేసీఆర్‌ మొగ్గు

హనుమకొండ జెడ్పీ చైర్మన్‌గా ఉన్న సుధీర్‌కుమార్‌

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి

ఉద్యమాల్లో కీలకపాత్ర

ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌లో పలు పదవుల నిర్వహణ

మాజీ ఎమ్మెల్యే టి.రాజయ్యకు మరోమారు నిరాశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement