వనపర్తి: మత్తు పదార్థాల వినియోగంతో ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజానికి కూడా హానికరమని.. మత్తు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. రాష్ట్రంలో జూనియర్ రెడ్‌క్రాస్, యూత్ రెడ్‌క్రాస్ వలంటీర్ల నమోదు కార్యక్రమంతో పాటు నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్, కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం కలెక్టరేట్‌లో నషా ముక్త్ భారత్ అభియాన్ వాల్‌పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని, యువత మత్తుకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.. నషా ముక్త్ భారత్ మనందరి బాధ్యతన్నారు. అనంతరం జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ పోతుల అమరేందర్ మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిస కాకుండా ఉండేందుకు అవగాహన సదస్సులు, కార్నర్ మీటింగ్‌ల ద్వారా చైతన్యవంతులను చేస్తామని తెలిపారు. నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్య సాధనకు రెడ్‌క్రాస్ వలంటీర్లు విస్తృతంగా కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారి యాదయ్య, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు ఎల్లా భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు బాలలింగయ్య, మిషేక్, మధు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాభివృద్ధికి బాటలు..
హైదరాబాద్‌లో డిసెంబర్ 11 నుంచి 22 వరకు జాతీయస్థాయి ఖేలోఇండియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. క్రీడలకు సంబంధించి శనివారం కలెక్టరెట్‌లో కలెక్టర్ సెల్ఫీ ఫొటో దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయస్థాయి క్రీడా పోటీలకు రాష్ట్రం వేదిక కావడం గర్వకారణమన్నారు. విద్యార్థులు, యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవడంతో పాటు తమలోని క్రీడా ప్రతిభను వెలికితీసి ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. జాతీయస్థాయి క్రీడలను యువత ప్రత్యక్షంగా వీక్షించడంతో స్ఫూర్తి పొందవచ్చని తెలిపారు.


