వనపర్తి టౌన్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027 విద్యా సంవత్సరం ఆరోతరగతిలో ప్రవేశాలకుగాను శనివారం జిల్లాకేంద్రం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగింది. మొత్తం నాలుగు కేంద్రాల్లో 1,068 మంది విద్యార్థులకుగాను 900 మంది హాజరుకాగా.. 168 మంది గైర్హాజరయ్యారు. జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో రెండు, బాలుర ఉన్నత పాఠశాల, చాణక్య ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం హాల్టికెట్ ఉన్న వారిని మాత్రమే కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల ఆవరణలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయి పరిశీలకులు, ప్రత్యేక పరిశీలకులు. ఇన్చార్జి జిల్లా విద్యాధికారి యాదయ్య, గిరిజన సంక్షేమ అధికారి మధు, నవోదయ విద్యాలయ వట్టెం ప్రిన్సిపాల్, ఏసీజీఈ గణేష్కుమార్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.


