● ‘ఇందిరమ్మ’ పథకంలో తొలి ప్రాధాన్యం
● ‘ప్రజాపాలన’ ప్రత్యేక అధికారి, రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్
వనపర్తి: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. గుడిసెల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి, రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ, ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంతో పాటు ఖిల్లాఘనపురంలో పర్యటించి డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన ఆయన సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ జిల్లాలో ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేక అధికారికి వివరించారు. అనంతరం ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బ్లాక్‌స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వంటగ్యాస్ కనెక్షన్ల వినియోగాన్ని నిర్ధారించాలన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్‌పాం వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరారు. రెవెన్యూ అధికారులు దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తులను అనవసరంగా తిరస్కరించకుండా పరిష్కరించడం తప్పనిసరన్నారు. గృహజ్యోతి, రాయితీ గ్యాస్ సిలిండర్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపై ఆరా తీశారు. మంజూరైన, గ్రౌండింగ్ జరిగిన, పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 5,982 ఇళ్లు మంజూరు కాగా, 5,173 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందని, 1,300 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని కలెక్టర్ వివరించారు. నిరుపేదలకు శాశ్వత గృహ వసతి కల్పించడమేనని పథకం లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే తదుపరి విడతలో బేస్‌మెంట్ స్థాయి, పైకప్పు స్థాయి వరకు నిర్మాణం చేపట్టిన వారికి కూడా ఇళ్లు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా రుణాలు ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరానికి మించి ఎత్తైన బేస్‌మెంట్లు, అధిక వ్యయంతో కూడిన నిర్మాణాలు చేపట్టవద్దని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆయన తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, వినోద్‌కుమార్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


