● అధికారిక ఉత్తర్వులు, నిర్ణయాలు, అంతర్గత విషయాలు బయటకు..
● ఇటీవల ఏసీబీకి చిక్కిన జిల్లాస్థాయి అధికారి
● దుమారం రేపుతున్న టీఏల ఆన్‌లైన్ లావాదేవీలు
రూ.95 లక్షల బ్యాంకు గ్యారెంటీ బాండ్ ఎక్కడా?
గత సీజన్‌లో జిల్లాలోని పెద్దమందడి మండలానికి చెందిన ఓ మిల్లర్ తనకు ధాన్యం కేటాయించాలని ఇచ్చిన రూ.95 లక్షల బ్యాంకు గ్యారంటీ బాండ్ కనిపించడం లేదంటూ.. ఇదేశాఖకు చెందిన ఓ అధికారి కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని సైతం సదరు కార్యాలయ ఉద్యోగులు బాహాటంగా కలెక్టరేట్‌లో చర్చించుకోవడం గమనార్హం. ఎంతో విలువైన బ్యాంకు గ్యారెంటీలకే కార్యాలయాల్లో భద్రత లేకుంటే.. సామాన్య కార్యాలయ పరిపాలన వివరాల ప్రతులకు ఎంతమేర జాగ్రత్త చేస్తారో చెప్పనవసరం లేదనే అసహనం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు ఉపక్రమించకుంటే రాష్ట్రస్థాయిలో జిల్లా అప్రతిష్టపాలు కావడం ఖాయమనే వాదనలు అధికారవర్గాల్లో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యం పండించే జిల్లాగా వనపర్తి పేరును కాపాడాల్సిన అవసరం ఉందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి.
పౌరసరఫరాలశాఖ
వనపర్తి: జిల్లా పౌరసరఫరాలశాఖ పరిధిలోకి వచ్చే రెండు కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం లోపించడంతో కొన్ని నెలలుగా విభేదాలు భగ్గుమంటున్నాయి. కొంతకాలంగా కలహాలు చోటు చేసుకోవడం జిల్లా ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఇదే కారణంతో 2026, జనవరి 9న జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఏసీబీకి పట్టుబడ్డాడనే వాదనలు వినిపించాయి. ఈ ఘటన తర్వాత వరుస టాస్క్‌ఫోర్స్ దాడులు, శాఖలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్రస్థాయి అఽధికారులకు సైతం ఫిర్యాదులు అందడం లాంటి ఘటనలు తరుచూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం గమనార్హం. తోటి ఉద్యోగులను టార్గెట్ చేయడం, అనుచరులతో రహస్యంగా ఫిర్యాదులు చేయించడంలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.


