‘కో–ఆప్షన్‌’.. కలేనా..! | - | Sakshi
Sakshi News home page

‘కో–ఆప్షన్‌’.. కలేనా..!

Jun 23 2026 7:43 AM | Updated on Jun 23 2026 7:43 AM

నారాయణపేట/మరికల్‌: గ్రామపంచాయతీ పాలనలో అనుభవజ్ఞులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణా పంచాయతీరాజ్‌ చట్టం–2018లో పొందుపర్చిన కో–ఆప్షన్‌ సభ్యుల నియామక ప్రక్రియ ఆచరణలో మాత్రం ముందుకు కదలడం లేదు. పాలకవర్గాలు ఏర్పడి ఆరు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,671 గ్రామపంచాయతీలకు నియమించాల్సిన 5,013 మంది కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిలిచిపోయింది. నియామక ప్రక్రియపై ప్రభుత్వం మౌనం పాటిస్తుండటంతో వేలాది మంది ఆశావహుల నిరీక్షణ కొనసాగుతోంది. చట్టం ప్రకారం పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నా.. గడువు దాటి నాలుగు నెలలు అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ఆలస్యం కేవలం పదవుల నియామకానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. గ్రామ పాలనలో అనుభవజ్ఞులు, సామాజిక కార్యకర్తలు, దాతలు, ప్రవాస భారతీయుల భాగస్వామ్యాన్ని కోల్పోవడమేనని స్థానిక సంస్థల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రతి గ్రామపంచాయతీలో ముగ్గురికి..

పదవీ విరమణ చేసిన ఉద్యోగి లేదా అనుభవజ్ఞుడైన సీనియర్‌ సిటిజన్స్‌, గ్రామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామసమాఖ్య అధ్యక్షురాలు, గ్రామాభివృద్ధికి దోహదపడిన ఎన్‌ఆర్‌ఐ, దాత లేదా స్థలం ఇచ్చిన వ్యక్తి. వీరికి వార్డు సభ్యులతో సమాన ప్రొటోకాల్‌, సమావేశాల్లో పాల్గొనే హక్కు ఉంటుంది. అయితే తీర్మానాలపై ఓటు హక్కు ఉండదు.

ఎందుకు కీలకం..?

గ్రామాల్లో చాలామంది పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, అధికారులు, ఇంజినీర్లు, బ్యాంకు ఉద్యోగులు, వ్యవసాయ నిపుణులు ఉన్నారు. వారి అనుభవాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని రూపొందించారు. గ్రామాల్లో నిధుల వినియోగం, చెరువుల పునరుద్ధరణ, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యరంగాల్లో అనుభవజ్ఞుల సూచనలు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే నియామకాలు జరగకపోవడంతో ఆ అవకాశం వృథా అవుతోంది.

ప్రతి గ్రామపంచాయతీకి ముగ్గురు చొప్పున కో–ఆప్షన్‌ సభ్యులను నియమించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియ చేపడతాం. – వెంకట్రాములు,

డీపీఓ, నారాయణపేట

ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉంది..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement