వనపర్తి: ప్రతి ఒక్కరూ క్రీడలను జీవితంలో భాగంగా మార్చుకొని ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 40వ ఒలింపిక్ డే రన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయనతో పాటు అదనపు ఎస్పీ రాజేష్ మీనా ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒలింపిక్ డే రన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, అంబేడ్కర్ చౌక్, రాజీవ్‌గాంధీ చౌరస్తా, బస్ డిపో మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రతి పాఠశాలలో క్రీడా సంస్కృతి పెంపొందితేనే భవిష్యత్ ఒలింపియన్లు తయారవుతారని తెలిపారు. యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా స్థిరంగా, సామాజికంగా బాధ్యతాయుతంగా ఎదగాలంటే క్రీడలే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ఒలింపిక్ డే రన్‌తో ప్రజలందరికి ఆరోగ్యంపై అవగాహన పెరిగి ఫిట్ ఇండియా–హెల్తీ ఇండియా లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, ఆరోగ్యకరమైన జీవన విధానానికి, క్రమశిక్షణకు, దేశభక్తి భావన పెంపొందించడానికి అత్యంత ప్రభావవంతమైన సాధనమన్నారు. క్రీడా స్ఫూర్తి, ఐక్యత, గౌరవం, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రజల్లో పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ దినచర్యలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలన్నారు. రోజూ కనీసం ఒక గంట పాటు నడక, పరుగు, యోగా లేదా ఏదైనా క్రీడలో పాల్గొనడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, జట్టు భావనను పెంపొందిస్తాయని చెప్పారు. నేటి యువత మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్య మాలపై ఎక్కువ సమయం గడపకుండా క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన యువతే దేశానికి నిజమైన సంపద అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి, యువకుడు రోజూ వ్యాయామం చేయా లని సూచించారు. పుర చైర్‌పర్సన్ మాధవి, ఒలింపిక్ డే కన్వీనర్లు సురేందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, కుమార్, కౌన్సిలర్ బ్రహ్మచారి, డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, హెచ్ ఎం శివాజీ, పీడీలు మన్యం యాదవ్, శ్రీనివాసులు, నిరంజన్‌గౌడ్, మధు, శ్రీదేవి, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.


