వనపర్తి: వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, వాంతులు విరేచనాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని గురుకులాలు, కళాశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులు, భోజనం వడ్డించే వారికి ఐడల్ (టైఫాయిడ్) పరీక్షలు నిర్వహించాలని, ఎవరికై నా వ్యాధి లక్షణాలు కనిపిస్తే రెండు వారాల పాటు క్వారంటైన్ చేసి వైద్యం అందించాలని వైద్యశాఖ అధికారికి సూచించారు. మురుగు కాల్వలను శుభ్రం చేయించాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు మంగళ, శుక్రవారం క్రమం తప్పకుండా డ్రై డే నిర్వహించాలని కోరారు. అన్ని విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫ్రై డే – డ్రై డే పాటించాలన్నారు. గతంలో డెంగీ కేసులు నమోదైన వార్డులు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నీరు నిల్వకుండా చూసుకోవాలని పుర కమిషనర్లు, డీపీఓలను ఆదేశించారు. ప్రతి నెల 11, 21, 31 తేదీల్లో మంచి నీటి ట్యాంకులు శుభ్రం చేయాలని, శుభ్రం చేస్తున్న ఫొటోలు తీసుకోవడంతో పాటు రిజిస్టర్‌లో నమోదు జరగాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డీఆర్వో సూర్యప్రకాష్, ఎస్‌డీసీ తిరుపతయ్య, జిల్లా అధికారులు ఉన్నారు.
మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవం....
సోమవారం నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో పెద్దఎత్తున మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆయా రోజుల్లో విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని.. 26వ తేదీన 2కె రన్ ఉంటుందని చెప్పారు. వారం పాటు కొనసాగే మాదక ద్రవ్య వ్యతిరేక వారోత్సవంలో ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు మత్తు బారిన పడకుండా కమిటీలు చురుగ్గా పని చేయాలని, ఎక్కడైనా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో పాన్, గుట్కా తదితర దుకాణాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు గుర్తిస్తే తక్షణమే సమాచారమిచ్చి డి–అడిక్షన్ సెంటర్‌కు పంపించాలన్నారు. అనంతరం డీఎస్పీ బాలాజీనాయక్ మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ఫ్లెక్సీపై అధికారుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.


