మొదటి విడత ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

మొదటి విడత ముమ్మరం

Jun 22 2026 12:24 AM | Updated on Jun 22 2026 12:24 AM

జిల్లాలో ఇలా..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో 86.59 శాతం పురోగతి

అమరచింత: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు లబ్ధిదారులకు నిత్యం అవగాహన కల్పిస్తూ పనుల్లో వేగం పెంచుతున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 86.59 శాతం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని అధికారుల గణాంకాల ప్రకారం తెలుస్తోంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పురపాలికల్లో పుర కమిషనర్లు పనులను నిత్యం పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు సలహాలు సూచనలిస్తున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు హౌసింగ్‌ అధికారులు కూడా నిరంతరం ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటి నిర్మాణాల్లో పురోగతి సాధించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పాటు అదనంగా మరో రూ.రెండు, రూ.మూడు లక్షలు కలిపి తమ సొంతింటి కలను సాకాలం చేసేందుకు లబ్ధిదారులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.

నిబంధనల మేరకు ..

ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గ్రామ, పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్నారు. పాత ఇళ్లను కూల్చి కొత్తగా నిర్మించుకునే వారితో పాటు ఖాళీ స్థలాల్లో ఇంటిని నిర్మించుకునే వారు అన్నివైపులా రెండు ఫీట్ల స్థలం వదిలి నిర్మించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే వంటగది, హాలు, బెడ్‌రూంతో పాటు ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలనే నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ చకచకా పనులు చేపడుతున్నారు.

విడతల వారీగా బిల్లులు..

ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు విడతల వారీగా బిల్లులు చెల్లిస్తున్నారు. బేస్‌మెంట్‌ వరకు పూర్తిచేస్తే మొదటి విడతగా రూ.లక్ష, రూఫ్‌ లేవల్‌ వరకు గోడలు నిర్మిస్తే రూ.లక్ష, పైకప్పు వేస్తే రూ.2 లక్షలు, మరుగుదొడ్డితో పాటు పెయింటింగ్‌, విద్యుత్‌ పనులు పూర్తయితే మిగిలిన రూ.లక్ష చెల్లిస్తున్నామని హౌసింగ్‌ అధికారులు వివరించారు. విడతల వారీగా డబ్బులు చెల్లిస్తున్నామని, త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

జిల్లాలోని 255 గ్రామాలు, 5 పురపాలికల్లోని 80 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మొత్తం 6,538 మంది లబ్ధిదారులను గుర్తించిన అధికారులు పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందించగా.. అందులో 5,951 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. పత్రాలు అందుకున్న 45 రోజుల్లో పనులు ప్రారంభించాలని.. లేకుంటే ఇంటి మంజూరు రద్దు చేస్తామనే ప్రభుత్వ హెచ్చరికతో చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 5,153 లబ్ధిదారులకు అధికారులు మార్కింగ్‌ ఇవ్వగా.. 880 మంది లబ్ధిదారులు బేస్‌మెంట్‌ వరకు పనులు పూర్తి చేశారు. 1,824 మంది ఇంటి పైకప్పు నిర్మాణం పూర్తికాగా.. 482 మంది పైకప్పు వరకు గోడలు నిర్మించారు. కాగా ఇప్పటి వరకు 1,264 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు హౌసింగ్‌ అధికారులు వివరించారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 86.59 శాతం ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని వెల్లడిస్తున్నారు.

జిల్లాలో 6,538 మంది లబ్ధిదారుల గుర్తింపు.. 5,951 మందికి

మంజూరు పత్రాలు పంపిణీ

వివిధ దశల్లో కొనసాగుతున్న పనులు

1,264 ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తి

నిత్య పర్యవేక్షణతోనే సాధ్యమైందంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement