ఖిల్లాఘనపురం: సమాజంలోని యువత ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వాల్మీకి సంఘం చైర్మన్ గట్టు తిమ్మప్ప, వైస్ చైర్మన్ నాగేష్, ఖిల్లాఘనపురం ఎస్‌ఐ వెంకటేష్ అన్నారు. ఆదివారం మండలంలోని రుక్కన్నపల్లిలో వాల్మీకి, బోయ యువజన సంఘం ఆధ్వర్యంలో యువశక్తి ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిభిరం ప్రారం భోత్సవానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. గ్రామ వాల్మీకి, బోయ యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం నిర్వహించడం సంతోషించదగిన విషయమని.. వీరిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు యువత సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యవంతమైన యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. సేకరించిన 30 యూనిట్ల రక్తాన్ని వనపర్తి ప్రభుత్వ రక్తనిధికి తరలించినట్లు యువశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు కాగితాల మధు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కేతావత్ నరేష్, వాల్మీకి సంఘం అధ్యక్షుడు కుమార్‌నాయుడు, కుర్మయ్య, పలువురు వాల్మీకి, బోయ యువకులు, పెద్దలు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా
నెట్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: తెలంగాణ అమెచ్యూర్ నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి సీనియర్ ఫాస్ట్–5 పురుష, మహిళా నెట్‌బాల్ ఎంపికలు నిర్వహించినట్లు సంయుక్త కార్యదర్శి సయ్యద్ అంజద్‌అలీ తెలిపారు. ఈ ఎంపికలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 మందికిపైగా క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఎంపికయ్యే జట్లు పుదుచ్చేరిలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగే సీనియర్ ఫాస్ట్–5 జాతీయ స్థాయి నెట్‌బాల్ చాంపియన్ షిప్‌లో పాల్గొంటాయని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు హబీబ్‌ఖాన్, మహ్మద్ ఖాజా అక్రముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
నేడు నాగర్‌కర్నూల్‌కు మంత్రి సీతక్క రాక
కందనూలు: రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి సోమవారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు జిల్లాలోని తాడూరు మండలం సిర్సవాడ గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ దుండుభీ వాగుపై రూ.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో రూ.5 కోట్ల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ ప్రణాళికలు పరిశీలించనున్నారు. అలాగే తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు.
మైసమ్మ చెంత..
తాగునీటికి చింత
పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ సన్నిధిలో ఆదివారం భక్తులు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మృగశిర కార్తె చివరి వారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు, భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. కానీ భక్తులకు అవసరమైన తాగునీటి అందించడంలో నిర్వాహకులు, ఎండోన్మెంట్ అధికారులు విఫలమయ్యారు. దీంతో మినీ ట్యాంకు వద్ద ట్రాక్టర్‌ను ఉంచి భక్తులు ట్యాంక్‌పై నుంచి బిందెలతో నీటిని తోడుకున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ భక్తులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులకు లేదని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి జాతరలో ఉన్న అన్ని ట్యాంకుల్లో నీటిని నింపి ఇబ్బందులు రాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.


