యోగా సాధనతో ఆరోగ్య పరిరక్షణ | - | Sakshi
Sakshi News home page

యోగా సాధనతో ఆరోగ్య పరిరక్షణ

Jun 22 2026 12:24 AM | Updated on Jun 22 2026 12:24 AM

వనపర్తి: యోగాతో శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించగలమని.. నిత్యం సాధన చేయడం అలవాటు చేసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రం సమీపంలోని మర్రికుంటలో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ ముఖ్యఅతిథులుగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, అధికారులతో యోగా శిక్షకురాలు సుగుణ సుమారు 40 నిమిషాల పాటు సాధన చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగా లేదా ఏదైనా శారీరక వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో కీలకమని, రోజూ యోగా సాధన చేయడంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులను కలెక్టర్‌ అభినందించారు.

నషా ముక్త్‌ భారత్‌ ప్రతిజ్ఞ..

నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్‌రెడ్డి, డీఎస్పీ గిరిబాబు, జిల్లా రవాణాశాఖ అధికారి, ఆయుష్‌శాఖ అధికారులు వసుంధర, విశ్వశాంతి, గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్‌ సరస్వతి, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement