● జిల్లాలోని 13 కేంద్రాల్లో
3,862 మంది విద్యార్థులు హాజరు
● పరీక్ష సరళిని పరిశీలించిన
కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: నీట్ (యూజీ) ప్రవేశ పరీక్ష జిల్లావ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులందరికీ మహబూబ్‌నగర్‌లోనే కేంద్రాలు ఏర్పాటు చేయగా.. చాలామంది విద్యార్థులు ఉదయం 9 గంటల వరకే చేరుకున్నారు. మొత్తం 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. ఇందులో 3,862 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,291 మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 429 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాల వద్ద విద్యార్థులు ధరించిన ఆభరణాలను తొలగించిన తర్వాత అనుమతించారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను కేంద్రాల వద్దకు తమ వాహనాలపై విద్యార్థులను చేర్చారు. నగరంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలను కలెక్టర్ ఖుష్బూగుప్తా తనిఖీ చేశారు. భద్రతా చర్యలు, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్పీ జానకి పాలమూరు యూనివర్సిటీ, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల,ఎన్‌టీఆర్ డిగ్రీ కళాశాల కేంద్రాలను పరిశీలించారు.


