లోక్‌అదాలత్‌లో 5,264 కేసులు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌అదాలత్‌లో 5,264 కేసులు పరిష్కారం

Jun 21 2026 8:16 AM | Updated on Jun 21 2026 8:16 AM

వనపర్తిటౌన్‌: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీమార్గమే ఉత్తమమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌జడ్జి జి.కళార్చన అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టుతో పాటు ఆత్మకూరు కోర్టులో లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. చిన్నచిన్న కేసుల్లో సైతం కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. కక్షిదారులు రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి, సంతోషంగా ఉండొచ్చన్నారు. అదే విధంగా ఇరు వర్గాలకు సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. లోక్‌అదాలత్‌లో సివిల్‌ కేసులు 11, క్రిమినల్‌ 1,527, ప్రీ లిటిగేషన్‌ కేసులు 3,726తో కలిపి మొత్తం 5,264 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌జడ్జి కె.కవిత, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి టి.కార్తీక్‌రెడ్డి, ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి బి. శ్రీలత, సెకండ్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి ఎన్‌.అశ్విని, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌కుమార్‌, డీఎస్పీ గిరిధర్‌రావు, న్యాయవాదులు పాల్గొన్నారు.

మోదీ హయాంలోనే దేశం సమగ్రాభివృద్ధి

వనపర్తిటౌన్‌: ప్రజాసేవే పరమావధిగా పనిచేసే ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే దేశం అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తోందని యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్రగాని సందీప్‌గౌడ్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఎన్‌.అరవింద్‌ ఆధ్వర్యంలో నమో జెన్‌జీ కాన్‌క్లేవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2028లోగా భారత్‌ను ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. 2014లో స్టాండ్‌ అప్‌ ఇండియా ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రూ. 15వేల కోట్లతో ప్రారంభమైన రుణాలు.. 2026 వరకు రూ.61వేల కోట్లకు చేరాయని గుర్తుచేశారు. వైద్య కళాశాలల సంఖ్య 842 నుంచి 2,100 చేరిందని.. ఏంబీబీఎస్‌ సీట్లు 2.5 రేట్లకు పైగా పెరిగి 1.30 లక్షలకు, పీజీ సీట్లు 31వేల నుంచి 86 వేలకు, ఎయిమ్స్‌ హాస్పిటల్స్‌ 8 నుంచి 23కు పెరిగాయని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, జెడ్పీ మాజీ చైర్మన్‌ రాకాసి లోకనాథ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, కొమ్ము శ్రీనివాసులు, రవి నాయక్‌, చింతకాయల శివ, వెంకటేశ్‌ నాయక్‌, చంద్రశేఖర్‌, రాము, రాజు నాయక్‌ పాల్గొన్నారు.

‘గణపసముద్రం’లో బోరుబావుల సర్వే

ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని గణపసముద్రం రిజర్వాయర్‌లో శనివారం బోరుబావులు, చెట్లు, పైపులైన్లు, బావుల సర్వే ప్రారంభమైంది. ఇరిగేషన్‌శాఖ ఏఈ అనిల్‌, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌, ఎస్‌డీసీ డిప్యూటీ తహసీల్దార్‌ ఆసీఫ్‌ సమక్షంలో సర్వే నిర్వహించినట్లు మండల సర్వేయర్‌ ఆనంద్‌ తెలిపారు. సుమారు 10 సర్వేనంబర్లలో సర్వే నిర్వహించడం జరిగిందని.. సోమవారం మిగతా సర్వే నంబర్లలో సర్వే పూర్తిచేసి, పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు.

నీట్‌ అభ్యర్థులకు

ఉచిత బస్సు సౌకర్యం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ఈనెల 21న నీట్‌ రీ–ఎగ్జామ్‌ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్‌ఎం సంతోష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బస్సు ఎక్కేముందు కండక్టర్‌ లేదా డ్రైవర్‌కు తమ హాల్‌టికెట్‌ చూపిస్తే సరిపోతుందన్నారు. ఈ సదుపాయం మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని ఏసీ సహా అన్ని బస్సు సర్వీసులకు వర్తిస్తుందని తెలిపారు. ఆయా మార్గాలలో అదనపు బస్సులు నడుపుతామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అని డిపోల మేనేజర్లను ఆదేశించామని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే టీజీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040–2345 0033, 6815 3333, 99592 26295, 99592 26296 లకు సంప్రదించవచ్చని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement