జిల్లాలో నామమాత్రంగా ప్రభుత్వ కళాశాల వసతి గృహాలు
అలా మళ్లుతున్నారు..
ప్రభుత్వ వసతి గృహాల సంఖ్య పెంచాలి..
అరకొర ‘వసతి’..
● సామర్థ్యానికి మించి ఎక్కువ మంది విద్యార్థులకు వసతి కల్పన
● మరో 6 సంక్షేమ హాస్టళ్ల కోసం ముగ్గురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలు
● కొల్లాపూర్‌లోని 2 నాన్ వర్కింగ్ హాస్టళ్ల తరలింపునకు యత్నం
● ఆదిలోనే ఆగిన ప్రక్రియ..
ఏడాదిగా ఫైల్ పెండింగ్‌లోనే..
ఎంవీఎస్ ప్రాంగణంలోని ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్ బీలో విద్యార్థులు
దేవరకద్రలో ఇప్పటివరకు ప్రభుత్వ కాలేజీలు లేవు. సంక్షేమ హాస్టళ్లు లేవు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాతే డిగ్రీ కళాశాలకు అనుమతులు వచ్చాయి. ఆ వెంటనే సంక్షేమ హాస్టల్ కోసం ప్రతిపాదనలు పంపాను. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరో పది, 15 రోజుల్లో కల సాకారమయ్యే అవకాశం ఉంది.
– జి.మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర
ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతి కోసం విద్యార్థుల నుంచి ప్రతి ఏటా అధిక మొత్తంలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ఎస్సీ, బీసీ వసతి గృహాలు అదనంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గత కలెక్టర్ విజయేందిర హయాంలోనే పంపడం జరిగింది. అనుమతులు రావాల్సి ఉంది.
– సునీత, డీడీ, ఎస్సీ సంక్షేమ శాఖ
ప్రస్తుతం 3 వేల మందికే..
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ కళాశాల వసతి గృహాలు ఆరు, బీసీ హాస్టళ్లు ఐదు, గిరిజన హాస్టళ్లు మూడు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది వసతి పొందుతున్నారు. లెక్క ప్రకారం ఆయా హాస్టళ్లలో మొత్తంగా 2 వేల మందికి సరిపోను సౌకర్యాలు ఉండగా.. స్థాయికి మించి మరో వెయ్యి మందికి పైగా వసతి కల్పిస్తున్నారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ విద్యార్థులు అధిక శాతం మంది వివిధ విద్యా సంస్థల్లో సీట్లు వచ్చినప్పటికీ.. ప్రభుత్వ హాస్టళ్లలో వసతి పొందలేకపోతున్నారు.
అదనంగా 10 హాస్టళ్లు అవసరం..
ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి వందకు పైగా కళాశాలల స్థాయి విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా సుమారు 25 వేల నుంచి 28 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో కేవలం మూడు వేల మందికే ప్రభుత్వ వసతి గృహాల్లో చోటు దక్కుతోంది. అంతకుముందు ఏడాది 2,500 మందికి వసతి కల్పించగా.. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గత సంవత్సరం మరో 500 మందికి అవకాశం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా మరో 10 వేల మంది వరకు ప్రభుత్వ హాస్టళ్లలో వసతి కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మరో పది సంక్షేమ హాస్టళ్ల అవసరం ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితం..
సంక్షేమ కళాశాలల హాస్టళ్లకు పేద విద్యార్థుల నుంచి డిమాండ్ పెరగడంతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వసతి గృహాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొత్తం ఆరు ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల కోసం వారు ప్రపోజల్స్ పంపినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో అధికారులు పరిశీలించి.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని రెండు నాన్ వర్కింగ్ హాస్టళ్ల (విద్యార్థులు లేరు)ను మహబూబ్‌నగర్‌కి తరలించేలా ప్రయత్నించారు. ఈ ప్రక్రియకు ఆదిలోనే అడ్డంకి ఏర్పడగా.. ప్రభుత్వ హాస్టళ్ల ఏర్పాటు ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ విద్యాసంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు.
మహబూబ్‌నగర్‌లో ఒక్కొక్కటిగా అన్ని రకాల టెక్నికల్, నాన్ టెక్నికల్, న్యాయ, వైద్య విద్యా సంస్థలు వెలియడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం విద్యాహబ్‌గా మారింది. దీంతో నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి విద్యార్థులు మహబూబ్‌నగర్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆయా కోర్సుల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరుగుతండడంతో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వ కళాశాలల్లో అనుబంధంగా వసతి గృహాలు లేకపోవడం, ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే స్థోమత లేకపోవడంతో అధిక సంఖ్యలో పేద విద్యార్థులు ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతికి మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి ఐదు, బీసీ రెండు, గిరిజన రెండు, మైనార్టీ వసతి గృహాలు ఒకటి మాత్రమే ఉన్నాయి. ఇవి సరిపోకపోవడంతో పలువురు పేద విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో నెలనెలా ఫీజులు కడుతూ.. చివరకు వచ్చే సరికి ఆర్థిక భారం కావడంతో చదువుకు మధ్యలోనే స్వస్తి చెబుతున్నారు.
గత విద్యాసంవత్సరం మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెస్పిరేటరీ కోర్సులో చేరాను. కళాశాలకు అనుబంధంగా వసతి లేకపోవడంతో ఎస్సీ వసతి గృహంలో దరఖాస్తు చేసుకున్నా. కానీ సీట్ల కొరతతో నాకు అవకాశం రాలేదు. నా కుటుంబానికి ఆర్థిక భారమైనా విధిలేని పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో నెలకు రూ.3,500 కడుతూ విద్యనభ్యసిస్తున్నా. ఇంకా మూడేళ్లు చదవాల్సి ఉంది. ఈ సంవత్సరమైనా ప్రభుత్వ వసతి గృహాల సంఖ్య పెంచితే మాలాంటి పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. – సాయిరాం, రెస్పిరేటరీ విద్యార్థిని, నాగర్‌కర్నూల్


