ఎకరం @ రూ.2కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఎకరం @ రూ.2కోట్లు

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

పెరిగిన రేట్ల ప్రకారమే..

జిల్లాకేంద్రంలో ఒక ప్లాటు రూ.41లక్షలకు పైమాటే..

నామమాత్రంగా రిజిస్ట్రేషన్లు..

రాష్ట్ర రాజధానికి తీసిపోని విధంగా భూముల ధరలు

వనపర్తి: రాష్ట్ర రాజధానికి తీసిపోని విధంగా జిల్లాలోని భూముల విలువ పెరిగింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలను ప్రభుత్వం సవరించడంతో వాటి రెక్కలొచ్చాయి. జాతీయ రహదారిని అనుసరించి ఉన్న మండలాల్లో ఎకరా భూమి రూ. కోటి ఉన్న ధర.. ప్రస్తుతం రూ. 2కోట్లకు చేరింది. జిల్లాలోని భూముల విలువ, మార్కెట్‌ విలువ వ్యత్యాస్యాన్ని సేకరించిన ప్రభుత్వం.. స్వలంగా తేడాలు ఉన్నచోట 25 నుంచి 75 శాతం, డబుల్‌ కంటే ఎక్కువ తేడా ఉన్నచోట 100శాతం పెంచింది. భవనాల విలువ పెంపు విషయంలో 50 కంటే ఎక్కువగా జిల్లావ్యాప్తంగా ఎక్కడా పెంచలేదని తాజాగా అమల్లోకి వచ్చిన నూతన మార్కెట్‌ విలువల ధరల మేరకు తెలుస్తోంది.

కొత్తకోట మండలంలో అత్యధికంగా..

జిల్లాలో జాతీయ రహదారిని అనుసరించి ఉన్న కొత్తకోట, పెబ్బేరు, పెద్దమందడి మండలాల్లోని భూముల ధరలు అత్యధికంగా పెరిగినట్లు తెలుస్తోంది. కొత్తకోట మండలం పాలెం పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి పక్కన ఎకరం భూమి గతంలో రూ.కోటి ధర ఉండగా, మార్కెట్‌ విలువ అంతకు మించి ఉందని తెలుసుకున్న ప్రభుత్వం.. జిల్లావ్యాప్తంగా మరెక్కడా లేనంతగా ఎకరం భూమి విలువను రూ. 2కోట్లకు పెంచింది. దీంతో జిల్లాలోని భూముల విలువ రాష్ట్ర రాజధాని భూములతో పోటీ పడుతున్నాయని చర్చ సాగుతోంది. ఆ తర్వాత పెబ్బేరు, పెద్దమందడి శివారు ప్రాంతాల్లో జాతీయ రహదారి పక్కన ఉన్న భూముల విలువ రూ. కోటి నుంచి రూ. 1.50 కోట్లకు పెంచినట్లుగా తెలుస్తోంది. ఈ ధరల పెంపుతో రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని పక్కనపెడితే.. కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్‌ కోసం రూ.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.

స్వల్పంగా పెరిగిన భవనాల విలువ..

రోజురోజుకూ ధరలు తగ్గిపోయే ఆర్‌సీసీ, నాన్‌ ఆర్‌సీసీ భవనాల ధరలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పోల్చితే కేవలం 25శాతమే పెంచారు. రేకుల, పెంకులతో పైకప్పు ఉన్న నిర్మాణాలను అతి స్వల్పంగా పెంచారు. వాటి విక్రయాల సమయంలో చెల్లించాల్సిన రిజిస్టేషన్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ తదితర చార్జీలు అన్నింటిని చెల్లించినా గతంలో కంటే అతి స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది.

శుక్రవారం నుంచే ప్రభుత్వం పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. పెరిగిన రేట్ల ప్రకారం స్టాంఫ్‌, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు వసూలుచేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయడంతో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు. ప్రశాంతంగా పెరిగిన ధరల ప్రకారం ప్లాట్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. వెంటనే నిర్మాణపు ఆస్తుల వివరాలు మున్సిపల్‌ రికార్డుల్లోనూ మారిపోతాయి.

– చంద్రశేఖర్‌, సబ్‌ రిజిస్టార్‌, వనపర్తి

వ్యవసాయ, వ్యవసాయేతర భూమి రేట్లు రెట్టింపు

జిల్లాకేంద్రంలో గజం స్థలం

గరిష్టంగా రూ.30,900 పెంపు

మార్కెట్‌ విలువల సవరణతో భూముల ధరలకు రెక్కలు

జిల్లావ్యాప్తంగా పెంచిన ధరల ప్రకారం అత్యధికంగా జిల్లా కేంద్రంలోని రామాలయం, మెట్టుపల్లి, శ్రీనివాసాపురం, మర్రికుంట, నాగవరం తదితర ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు ధరలు విపరీతంగా పెరిగాయి. స్థానిక రామాలయం ప్రాంతంలో గజం ధర రూ. 24,800 ఉండగా.. ప్రస్తుతం పెంచిన విలువతో రూ. 30,900 ధర పెరిగినట్లు అధికారిక లెక్కలతో వెల్లడవుతోంది. దీంతో సాధారణ 30/40 సైజు ప్లాటు సైతం ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం రూ. 41లక్షలకు పైబడి ధర నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో ఒక చిన్న ప్లాటు రిజిస్టేషన్‌ చేసుకోవాలన్నా రూ.లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది.

ఇతర ప్రాంతాల్లో ఈ నెల 5 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు, ఆర్‌సీసీ, నాన్‌ ఆర్‌సీసీ నిర్మాణాల విలువలను పెంచుతున్నట్టు ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఈ మేరకు అధికారులు నెలరోజులపాటు కసరత్తు చేశారు. అయినప్పటికీ వనపర్తి, ఆత్మకూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అనుకున్న మేరకు రిజిస్ట్రేషన్ల సందడి కనిపించలేదు. సాధానంగా నెలవారీగా అయ్యే రిజిస్ట్రేషన్లతో పోల్చితే 10శాతం ఎక్కువగా అయినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement