● ఫిట్‌నెస్‌ను జీవితంలో భాగస్వామ్యం కావాలి
● గవర్నర్ శివప్రతాప్ శుక్లా
● ముగిసిన సంసద్ ఖేల్ మహోత్సవ్
మహబూబ్‌నగర్ క్రీడలు: యువతే వికసిత్ భారత్‌లో కీలకపాత్ర అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం ద్వారా బలమైన దేశ నిర్మాణం సాధ్యమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ బహుమతుల ప్రదానోత్సంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రతిభను ఒక వేదికపైకి తీసుకొచ్చే ఈ తరహా క్రీడా ఉత్సవాలు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి కళలు భారతీయ సంప్రదాయాలు, శరీరక, మనస్సు, ఆత్మల సమతుల్యతను పెంపొందిస్తాయన్నారు. ఫిట్‌నెస్‌ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. విజేతలందరికీ అభినందనలు తెలిపిన గవర్నర్, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, యువతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ బలమైన ఐక్య భారతదేశ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ట్రోఫీలతో పాటు విన్నర్ జట్టుకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేలు నగదు పారితోషికం అందజేశారు.
క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు
ఖేల్ మహోత్సవ్
గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయస్థాయిలో చేర్చేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ దోహదం చేస్తుందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మోదీ చొరవతో ఇటీవల అంతర్జాతీయస్థాయి క్రీడల్లో దేశం ముందంజలో నిలుస్తుందన్నారు. ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు.
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ పిల్లలు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. క్రీడల తో మంచి సమాజ నిర్మాణం జరుగుతుందన్నా రు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువతను అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, త్రిషా పూజిత, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, బీజేపీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, పీఎంఎస్‌కేఎం పార్లమెంట్ ఇన్‌చార్జి జనార్దన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
● అంతకముందు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల క్రీడా జట్లు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించగా గవర్నర్ వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఖేల్ మహోత్సవ్ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


