
క్రమశిక్షణతోనే లక్ష్య సాధన సాధ్యం
వనపర్తిటౌన్: క్రమశిక్షణతోనే ఎంచుకున్న ఉన్నత లక్ష్య సాధన సాధ్యమవుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని తెలిపారు. ఈ నెల 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల వసతిగృహంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష్య ఛేదనలో పట్టుదల ఎంత ముఖ్యమో క్రమశిక్షణ సైతం అంతే ముఖ్యమని చెప్పారు. మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలు, వయోవృద్ధులు, మతిస్థిమితం కోల్పోయిన వారికి, సామూహిక విపత్తు, మానవ అక్రమ రవాణా బాధితులకు ఉచిత న్యాయసాయం అందిస్తామని చెప్పారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, నిర్భంద విద్య, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయురాలు లోహిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.