
చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలి
ఆత్మకూర్: చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కృష్ణవేణి చెరుకు రైతుసంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న కోరారు. శనివారం స్థానిక మార్కెట్‌యార్డులో జరిగిన ఉమ్మడి జిల్లా చెరుకు రైతుల సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.8,150 నిర్ణయించిందని.. అలాగే చెరుకు పంటకు టన్నుకు రూ.6 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెరుకు రైతుకు టన్నుకు రూ.వెయ్యి బోనస్ చెల్లించాలని, నిర్ణయించిన ధరకే కోతలు చేపట్టాలని, రవాణా విషయంలో ఇబ్బందులు తొలగించాలని కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రాయితీలు కొనసాగించాలని, పంట విక్రయించిన 14 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, సీడీసీ నిధులతో గ్రామాల్లో రహదారుల మరమ్మతు చేపట్టాలన్నారు. కోతల సమయంలో కార్మికుల కొరత లేకుండా చూడాలని, అధిక దిగుబడుల కోసం రైతులకు అవగాహన కార్యక్రమాలు, విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు మాసూం, వాసారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సంజీవరెడ్డి, రవి, నారాయణ, రాజశేఖర్‌రెడ్డి, శివుడు, చంద్రసేనారెడ్డి, తిరుపతయ్య, లింగన్న, రంగారెడ్డి, రాజు, నాగేంద్రం, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.