
ఓటు చోరీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కొత్తకోట: ఓటు చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పుర కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు చోరీకి పాల్పడి దేశంలో బీజేపీ గద్దెనెక్కిందని, వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని, మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆరోపించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఓటు చోరీకి సంబంధించిన ఆధారాలు బయటపెట్టినా కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోకుండా బీజేపీ కనుసన్నల్లో పని చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఉందని, ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను నిర్ణయిస్తారని, బీజేపీ ఓటు చోరీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయిలు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉందని, దీనిని ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. అనంతరం కూరగాయల మార్కెట్, సంతబజార్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.