గట్టెక్కించారు..
అధికారుల ముందుచూపుతో వేసవిలో సాగు, తాగునీటి ఎద్దడి నివారణ
పంట ఎండిపోతుంది
అనుకున్నా..
యాసంగిలో మూలమళ్ల శివారులో 5 ఎకరాల్లో వరి సాగుచేశా. చివరి రెండు తడులు నీరు అందకపోతే పంట ఎండిపోతుంది అనుకొని ఆశలు వదులుకున్నా. ఎమ్మెల్యే చొరవతో నీటిని వదలడంతో పంట చేతికొచ్చింది. ఎకరాకు 25 కింటాళ్ల దిగుబడి రావడం సంతోషంగా ఉంది.
– మోహన్‌రెడ్డి, సింగంపేట
ఉన్నతాధికారుల
సూచనలతో..
ప్రాజెక్టులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో యాసంగిలో ఆయకట్టులో సాగు విస్తీర్ణం తగ్గించాం. దీంతోపాటు వారబందీ విధానాన్ని పక్కాగా అమలుచేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చివరి తడులుగా రెండు పర్యాయాలు నీటిని అందించాం. ఆయకట్టులో పంటలు ఎండకుండా తగిన చర్యలు తీసుకొని సమస్యను అధిగమించగలిగాం.
– జగన్మోహన్‌రెడ్డి,
ఈఈ పీజేపీ నందిమళ్ల డివిజన్
ఎప్పటికప్పుడు మరమ్మతులు..
వేసవిలో ప్రజలకు తాగునీటి కష్టాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. తాగునీటి పథకాల మోటార్ల మరమ్మతుతో పాటు పైపులైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేశాం. చిన్న చిన్న మరమ్మతులు, సిబ్బంది అలసత్వం కారణంగా అక్కడక్కడ తాగునీటి సరఫరాలో అంతరాయం కలిగిందే తప్ప తాగునీటి కష్టాలు కలిగించలేదు.
– మేఘారెడ్డి, ఈఈ, మిషన్ భగీరథ, వనపర్తి
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, మిషన్ భగీరథ అధికారుల ముందుచూపు, పక్కా ప్రణాళికతో వేసవిలో సాగు, తాగునీటి కష్టాలు ఎదురుకాలేదు. వారబందీ విధానంలో నిర్దేశించిన ఆయకట్టు సాగునీటిని అందించడంతో రైతులు తమ పంటలను కాపాడుకొని ధాన్యాన్ని విక్రయించుకున్నారు. గ్రామాలు, పట్టణాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేయడంతో జిల్లాలో అక్కడక్కడ మినహా తాగునీటి కోసం జనం రోడ్డెక్కలేదని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 255 గ్రామాలకు జూరాల, కేఎల్‌ఐ ద్వారా తాగునీటి పథకాలకు నీటిని తరలించడంతో వేసవిలో ఇబ్బందులను అధిగమించినట్లు తెలిపారు.
వారబందీ విధానంలో..
జలాశయంలో నీటిమట్టం తక్కువగా ఉండటంతో యాసంగిలో జూరాల ఆయకట్టును కుదించారు. ఎడమకాల్వ విభాగంలో 85 వేల ఎకరాలకుగాను కేవలం 20 వేల ఎకరాలు, కుడికాల్వ పరిధిలో 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని.. ఎడమకాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్, రామన్‌పాడు రిజర్వాయర్ వరకు మాత్రమే రైతులు పంటలు సాగు చేయాలని పీజేపీ అధికారులు ముందస్తుగానే ప్రకటించారు. మిగిలిన ఆయకట్టు మండలాల్లోని రైతులు పంటలు సాగు చేయొద్దని.. వేసినా నీరందక ఎండిపోవడం ఖాయమని రైతులకు అవగాహన కల్పించడమేగాకుండా ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో టాంటాం వేయించారు.
ప్రభుత్వ చర్చలు సఫలం..
జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతుందని, ఇక్కడి ప్రజలకు తాగు, సాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతో చర్చలు జరిపింది. దీంతో నారాయణపూర్ డ్యాం నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేయడంతో కష్టకాలంలో గట్టెక్కినట్లయింది.
ప్రియదర్శిని జూరాల జలాశయం
జూరాల ఆయకట్టుకు
పక్కాగా వారబందీ అమలు
ఎగువ నుంచి నీటి
సరఫరాతో తీరిన ఇక్కట్లు
తాగునీటి సరఫరా ఇలా..
ఏప్రిల్‌లో జూరాల జలాశయంలో 2.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉన్న నీటిని వినియోగించి పూర్తిస్థాయిలో అందించేలా మిషన్ భగీరథ అధికారులు తగిన ప్రణాళికతో ముందుకు సాగారు. జూరాల ప్రాజెక్టు నందిమళ్ల క్యాంపు వద్ద ఉన్న సత్యసాయి తాగునీటి పథకం నుంచి నిత్యం 2 ఎంఎల్‌డీల నీటిని నారాయణపేట జిల్లాలోని 3 గ్రామాలు, వనపర్తి జిల్లాలోని 9 గ్రామాలకు అందిస్తూ వచ్చారు. రామన్‌పాడు తాగునీటి పథకం ద్వారా నిత్యం 24 ఎంఎల్‌డీల నీటిని 12 గ్రామాలు, ఎర్రగట్టు నుంచి 18.45 ఎంఎల్‌డీల నీటిని 34 గ్రామాలకు అందించారు. అదేవిధంగా కానాయపల్లి నుంచి 20 ఎంఎల్‌డీల నీటిని 115 గ్రామాలతో పాటు మహబూబ్‌నగర్‌లోని 3 గ్రామాలకు.. బుగ్గపల్లి తండా ద్వారా 75 ఎంఎల్‌డీల నీటిని 87 గ్రామాలతో పాటు కొత్తకోట, వనపర్తి పురపాలికలకు సరఫరా చేశారు. గోపాల్‌పేట ద్వారా 10 ఎంఎల్‌డీల నీటిని 44 గ్రామాలు, శ్రీరంగపురం నుంచి 5 ఎంఎల్‌డీల నీటిని 10 గ్రామాలతో పాటు పెబ్బేరు పురపాలికకు అందించారు. గోపల్‌దిన్నె ద్వారా 5 ఎంఎల్‌డీల నీటిని 19 గ్రామాలు, గౌరిదేవిపల్లి ద్వారా 7.7 ఎంఎల్‌డీల నీటిని రేవల్లి మండలంలోని 8 గ్రామాలు, ఎల్లూరు ద్వారా 13 ఎంఎల్‌డీల నీటిని వీపనగండ్ల, ఏదుల మండలాలకు సరఫరా చేశారు.
గట్టెక్కించారు..
గట్టెక్కించారు..
గట్టెక్కించారు..


