కొత్త పింఛన్లు లేనట్లే..! | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లు లేనట్లే..!

Oct 16 2026 1:06 AM | Updated on Oct 16 2026 1:06 AM

విజయనగరం ఫోర్ట్‌:

నమ్మించడం.. మోసం చేయడం చంద్రబాబుకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. అధికారం చేపట్టి రెండున్నరేళ్లవుతుంది. కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో వేలాది మంది పింఛన్ల కోసం ఎదురు చూశారు. భర్త చనిపోయిన వితంతువులు, 60 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, గీత కార్మికులు, చర్మకారులు కొత్త పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిరిగినా నిరాశే ఎదురైంది. స్థానిక ఎన్నికల వేళ గత నెలలో పింఛన్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేశారు. దరఖాస్తుకు 9 పనిదినాలు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వెబ్‌సైట్‌ను మూసేశారు. అష్టకష్టాలు పడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కొత్త పింఛన్‌ కోసం దరఖాస్తు చేశారు.

అక్టోబర్‌ నెలలోనే కొత్త పింఛన్లు మంజూరుచేస్తామని చంద్రబాబు సర్కార్‌, ఆ పార్టీ పాలకులు, నేతలు గొప్పగా ప్రచారం చేసుకున్నారు. పింఛన్‌ ఎక్కడ మంజూరు కాదో అన్న భయంతో చాలా మంది టీడీపీ నాయకులను ప్రసన్నం చేసుకున్నారు. చివరకు నిరాశే ఎదురైంది. ఇప్పుడు స్థానిక సంస్థల నోటిఫికేషన్‌ విడుదల కావడం, కోడ్‌ అమల్లో ఉండడంతో పింఛన్‌ మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే పింఛన్ల దరఖాస్తుకు చంద్రబాబు సర్కార్‌ అవకాశం కల్పించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

2027 సంవత్సరంలోనూ డౌటే!

‘ఏరుదాటేవరకు ఏరు మల్లన్న... ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న’ సామెత చందాన సీఎం చంద్రబాబు వ్యవహరిస్తారన్న విమర్శ ఉంది. స్థానిక సంస్థలు ముగిసిన తర్వాత చంద్రబాబు సర్కారు పింఛన్లు మంజూరు చేస్తుందని నమ్మలేమని లబ్ధిదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పింఛన్‌ దరఖాస్తులు స్వీకరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

● విజయనగరం మండలానికి చెందిన బి.సంతోష్‌ అనే దివ్యాంగుడికి రెండున్నరేళ్ల కిందట నరాలకు సంబంధించిన సమస్యపై వైద్యులు సదరం ధ్రువపత్రం అందజేశారు. వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో ఇన్నాళ్లు దరఖాస్తు చేసేందుకు వీలుకాలేదు. గత నెలలో పింఛన్‌ కోసం దరఖాస్తు చేశాడు. అక్టోబర్‌ నెలలో పింఛన్‌ వస్తుందని ఆశపడినా నిరాశే ఎదురైంది. మరో రెండు నెలల పాటు వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని మనోవేదన చెందుతున్నాడు.

ఎన్నికల వేళ పింఛన్ల దరఖాస్తుల

స్వీకరణ

అక్టోబర్‌ నెల మంజూరు చేయని వైనం

ఇప్పుడు ఎన్నికల కోడ్‌ రావడంతో

పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు

అవసరం తీరిన తర్వాత చంద్రబాబు సర్కార్‌ పరిస్థితి అందరికీ తెలిసిందే..

జిల్లాలో 52,090 మంది దరఖాస్తు

52,090 దరఖాస్తులు వచ్చాయి..

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు నుంచి వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. పింఛన్ల కోసం కొత్తగా 52,090 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా 27,764 మంది వృద్ధాప్య పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వితంతువులు 10,048 మంది, దివ్యాంగులు 5,815 మంది, గీత కార్మికులు 1262 మంది, డప్పు కళాకారులు 3,169 మంది, చేనేత కార్మికులు 501 మంది, ఒంటిరి మహిళలు 332 మంది, ట్రాన్స్‌జెండర్స్‌ 9 మంది, చర్మకారులు 2,303 మంది, మత్య్సకారులు 887 మంది దరఖాస్తు చేశారు.

గంట్యాడ మండలానికి చెందిన ఎస్‌.కాంతమ్మ భర్త రెండేళ్ల కిందట చనిపోయాడు. పింఛన్‌ కోసం దరఖాస్తు చేయడానికి ప్రభుత్వం వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయలేదు. సెప్టెంబర్‌ నెలలో పింఛన్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయడంతో దరఖాస్తు చేసింది. అక్టోబర్‌ నెల నుంచి పింఛన్‌ అందుతుంది.. ఆర్థిక కష్టాలు తీరుతాయని ఆశపడింది. ప్రభుత్వం అక్టోబర్‌లో కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ రావడంతో నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో కూడా కొత్త పింఛన్‌ వచ్చే పరిస్థితి లేదని తెలిసి మనోవేదన చెందుతోంది. అసలు పింఛన్‌ వస్తుందోరాదోనని బెంగపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement