సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశంలో ఎన్నడూ లేనివిధంగా మున్సిపాలిటీలోని క్యాడర్ అధిష్టానం మీద తిరుగుబాటు చేసింది. ఇదివరకు ఏ ఎన్నికలు జరిగినా అధిష్ఠానమే దేవాలయం.. నాయకులే దేవుళ్లు అంటూ చేతులు జోడించి నిలబడిన నాయకులు.. ఇప్పుడు మాత్రం తమ గళం విప్పారు. పార్టీలో పాతికేళ్లుగా ఉంటున్న తమను కాదని ఎవరో కొత్తవాళ్లకు మేయర్ అభ్యర్థిత్వం ఎలా కేటాయిస్తారంటూ ఎమ్మెల్యే అదితి గజపతి ఎదుటనే నిలదీశారు. ఇస్తే గిస్తే మన పార్టీలో మొదట్నుంచి ఉన్నవాళ్లకు ఇవ్వాలి కానీ నిన్నగాక మొన్న పార్టీలో చేరిన చిన్నశ్రీను కూతురు సిరి సహస్రకు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఆమెకు ఏ ప్రాతిపదికన టికెట్ ఇస్తారు.. ఎందుకు ఇవ్వాలి.. ఇలాగైతే మేమంతా పార్టీకి రాజీనామా చేసేస్తాం అంటూ మాజీ కార్పొరేట ర్లు, వార్డు ఇన్చార్జులు .. ఇలా రకరకాల స్థాయిల్లోని నాయకులూ సిరిసహస్ర పట్ల తమ వ్యతిరేకతను బాహాటంగా వెల్లడించారు. పత్రికా సమావేశం పెట్టిమరీ తమ అవిధేయతను, వ్యతిరేకతను అదితి ద్వారా అధిష్ఠానానికి పంపించారు. దీంతో ఇదేదో తేడా కొట్టేసినట్లుందని భావించిన పార్టీ పెద్దలు.. ఈపూటకు ఆపుదాం.. రేపు చూద్దాం అన్నట్లుగా శుక్రవారానికి మేయర్ అభ్యర్థి ప్రకటనను వాయిదా వేశారు.
స్కెచ్ వేసింది అదితి.. క్యాడర్తో లెటర్లు ...
మరోవైపు ఎమ్మెల్యే అదితి కూడా సిరి సహస్ర విషయంలో అంతగా మొగ్గుచూపడంలేదని తెలుస్తోంది. ప్రస్తుతం విజయనగరంలో అశోక్ బంగ్లా వేదికగా రాజకీయాలు జరుగుతున్నాయి. చిన్న గుమ స్తా బదిలీ నుంచి తహసీల్దార్ల పోస్టింగ్లు వరకూ బంగ్లాలోనే నిర్ణయాలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో కమిషనర్ మొదలు అందులోని కాంట్రాక్టులు.. అభివృద్ధి పనులు.. బిల్లుల చెల్లింపు.. చిరుద్యోగుల పోస్టింగుల బదిలీలు కూడా అదితి చెబితేనే జరుగుతున్నాయి. గెలిచే అవకాశం లేకపోయినా... పొరపాటున సిరిసహస్ర మేయర్ అయితే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని, పట్టణం మొత్తం ఆమె గుప్పిట్లోకి వచ్చేయగా కొన్ని పల్లెలు.. చిన్న గ్రామాలు మాత్రమే అదితికి మిగులుతాయన్న బెంగ ఆమెను వెంటాడుతోందట.
కొండచిలువ పిల్లను చంకలో పెంచుకున్నట్లే...
పోన్లే అని ఇప్పుడు కానీ సిరి అభ్యర్థిత్వాన్ని అదితి మొహమాటానికో.. కాదనలేకనో ఒప్పేసుకుంటే ఇక తన రాజకీయ సమాధికి అడ్వాన్స్ ఇచ్చేసినట్లే. పైగా చిన్నశ్రీను డామినేషన్ గురించి అదితికి పూర్తిగా తెలుసు. సిరి మేయర్ అయిన మరుక్షణం నుంచి క్యాడర్ మొత్తం చిన్న శ్రీను ఇంటి చుట్టూ తిరుగుతుంది. పట్టణం మొత్తం ఆయన కంట్రోల్లోకి వెళ్తుంది. రేపు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు అదితి గెలవాలా? ఓడిపోవాలా? అనేది చిన్నశ్రీను డిసైడ్ చేసే పరిస్థితి వస్తుంది. సిరి గెలిచిన వారం తరువాత ఆటోమేటిగ్గా బంగ్లా బోసిపోతుంది. ఇవన్నీ ఆలోచించిన అదితి.. సిరిసహస్రకు మేయర్ పదవి ఇవ్వడాన్ని అడ్డుకోకపోతే పట్టణంలో తన ఉనికి కూడా ఉండదని అర్థమైందట. బయటకు మాత్రం అధిష్టానమే ఫైనల్ అని చెబుతున్న లోలోన మాత్రం ఆమె ఈ తంతు నడిపించినట్లు సమాచారం. ఈ గోల ఇప్పుడే ఎందుకని అధిష్ఠానం ఈ ఎపిసోడ్ ఈపూటకు ముగించి రేపు చూద్దాం అని వర్తమానం పంపింది.
సిరిసహస్ర మేయర్ అభ్యర్థిత్వానికి అదితి నో!
60 మంది టీడీపీ నేతల లేఖలు..
ఆమెకు టికెట్ ఇస్తే రాజీనామా చేస్తామని
అల్టిమేటం
అభ్యర్థి ప్రకటన రేపటికి వాయిదా


