పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు

Oct 16 2026 1:06 AM | Updated on Oct 16 2026 1:06 AM

● 775 గ్రామ పంచాయతీలు, 7,312 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు

● గజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

విజయనగరం రూరల్‌: స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ పచ్చజెండా ఊపింది. మున్సిపల్‌, కార్పొరేషన్‌, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. వీటికి సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్‌ గజిట్‌ నోటిఫికేషన్‌ను మంగళవారమే జారీ చేశారు. అలాగే, గ్రామ పంచాయతీలు, వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు దశల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. గ్రామ పంచాయతీల రెండో సాధారణ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి బుధవారం గజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు.

పంచాయతీ సర్పంచుల రిజర్వేషన్లు ఇలా...

జిల్లాలో 27 మండలాల పరిధిలో 777 గ్రామ పంచాయతీలు ఉండగా 775 గ్రామ పంచాయతీలకు, వాటి పరిధిలో ఉన్న 7,312 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించి 379 స్థానాలు మహిళలకు కేటాయించగా, 396 పంచాయతీలు జనరల్‌కు కేటాయించారు. గరివిడి మండలం నీలాద్రిపురం, రేవిడి అగ్రహారం పంచాయతీలపై కోర్టు స్టే ఉండడంతో ఆ రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఎస్టీ వర్గానికి 18 (మహిళలు–3, జనరల్‌–15), ఎస్సీలకు 83 (మహిళలు–35, జనరల్‌–48), బీసీలకు 279 (మహిళలు–133, జనరల్‌–146), జనరల్‌ 395 (మహిళలు–206, జనరల్‌–189) గ్రామ పంచాయతీలు కేటాయించారు.

7312 వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఇలా...

జిల్లాలో 775 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనుండగా వాటి పరిధిలోని 7,312 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటిలో 162 ఎస్టీ స్థానాలకు, 777 ఎస్సీ స్థానాలకు కేటాయించారు. బీసీలకు 2,731 స్థానాలు రిజర్వ్‌ కాగా, జనరల్‌కు 3,642 స్థానాలు రిజర్వ్‌ అయ్యాయి. మహిళలకు 3,655 వార్డు స్థానాలు కేటాయించగా, జనరల్‌ 3,657 స్థానాలు కేటాయించారు.

● ఆశావహుల హడావిడి..

పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారులో నిమగ్నమయ్యాయి. దీంతో గ్రామాల్లో ఆశావాహుల హడావిడి మొదలయ్యింది. ఇప్పటికే ప్రధాన పార్టీల తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల అభ్యర్థిత్వం ఖరారులో నిమగ్నం కాగా, పార్టీల రహితంగా నిర్వహించే సర్పంచ్‌ అభ్యర్థులపై ఫోకస్‌ చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ సీపీ నుంచి ఇప్పటికే అనేక గ్రామాల్లో అభ్యర్థుల ఎంపికలు జరుగుతున్నాయి.

పోలింగ్‌ తేదీ మార్చాలని విజ్ఞప్తి..

విజయనగరం గంటస్తంభం: అక్టోబర్‌ 27న ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరగనున్న నేపథ్యంలో, విజయనగరం కార్పొరేషన్‌ పరిఽధిలో పోలింగ్‌, కౌంటింగ్‌ తేదీలను మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. పోలింగ్‌ తేదీని అక్టోబర్‌ 28కి బదులుగా అక్టోబర్‌ 29కి మార్చితే ప్రజలకు, అధికార యంత్రాంగానికి సౌకర్యవంతంగా ఉంటుందని ప్రతిపాదించినట్లు చెప్పారు. బ్యాలెట్‌ పేపర్లు, బ్యాలెట్‌ బాక్సులు, సిబ్బంది నియామకం, స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతపై ముందస్తు కసరత్తు పూర్తి చేశామని, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. అర్హులైన ఓటర్లందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, డీఆర్వో సీహెచ్‌.సత్తిబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement