సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ‘రెండేళ్ల పాలన–సంక్షేమం, అభివృద్ధి’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సెల్ఫ్‌డబ్బా కొట్టేందుకే అధిక ప్రాధాన్యమివ్వడాన్ని జనం అసహ్యించుకున్నారు. రెండేళ్లలో ఏం చేశాం.. ఏం చేయబోతున్నామన్నది చెప్పకుండా... గత ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమయ్యారు. రెండేళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, సున్నావడ్డీ వంటి హామీలు అమలుచేయకపోవడం, ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందజేయకపోవడం, ఉచిత పంటల బీమాకు మంగళం పాడేయడం, తల్లికి వందనంలో కోతపెట్టడం, తదితర ప్రజావ్యతిరేక విధానాలతో అన్నివర్గాల ప్రజల నుంచి చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో రెండేళ్ల పాలనపై సభలు నిర్వహించేందుకు నేతలు సైతం భయపడి.. ఆ బాధ్యతలను కలెక్టర్లపై నెట్టేసి సమా వేశాలకు హాజరవుతున్నారు. మైకు దొరికిన వెంటనే రెండేళ్లుగా చేసింది.. చెప్పేందుకు.. విషయం లేక గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తూ.. అబ్బబ్బ బాగా మాట్లాడేశాం.. ఇక మా మంత్రి పదవులకు డోకా లేదు అన్నట్టుగా జబ్బలు చర్చుకుంటున్నారు. జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత పాటు సీనియర్ ఎమ్మెల్యే కళా వెంకట్రావు, కూన రవికుమార్ తదితరులు ఇదే ఒరవడి సాగించడంపై జనం నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పటిలానే అభివృద్ధి రాజధాని అంటూ రెడీమేడ్ డైలాగులతో స్క్రిప్టు నడిపించేశారు. రెండేళ్లలో జిల్లాకు ఒక సాగినీటి ప్రాజెక్టు కానీ, చిన్న తరహా పరిశ్రమ కానీ జిల్లాకు తేలేకపోయారు. రెండేళ్లలో జిల్లాలో మూసివేతకు గురైన చిన్న పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయి. సూక్ష్మ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ విషయంలో తాను ఎంత కృషి చేశారో ఏం పురోగతి సాధించారో చెప్పుకోలేక గత ప్రభుత్వంపై సులువైన కామెంట్లు చేస్తూ స్పీచ్ ముగించేశారు. కార్యక్రమం మొత్తం ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా కలెక్టర్, ఎస్పీ బలవంతన్న నడిపించగా.. జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు మొక్కుబడికి వచ్చినట్లు వచ్చి మిక్చర్ తిని వెళ్లిపోయారు. బలవంతం మీద తీసుకొచ్చిన డ్వాక్రా మహిళలు, ఉపాధిహామీ వేతనదారులు కూడా నాయకుల ప్రసంగాలు వినలేక ఏ పక్కనుంచి వెళ్లిపోదామా అని ఎదురుచూశారు. చివరివరకు ఉన్నవారికి భోజనాలు అందక అవస్థలు పడ్డారు.
ఏం చేశారో
చెప్పలేరు..
ఏం చేస్తారో చెప్పరు..
రెండేళ్ల పాలనపై మంత్రుల డబ్బా ప్రొగ్రాం
మత్తుజోలికి పోవద్దు
విజయనగరం క్రైమ్: యువత మత్తులోకి పోవద్దని, జైలులో మగ్గిపోవద్దని హోంమంత్రి అనిత హితవుపలికారు. పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గంజాయి కేసులో దొరికిన వారికి నాన్‌బెయిలబుల్ కేసులు నమోదుచేస్తున్నారని, యువత జాగ్ర త్తగా ఉండాలన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సభ ప్రారంభమయ్యే ముందు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ సాంస్కృతిక కార్యక్రమాలు పోలీస్ శాఖ నిర్వహించింది. ‘రుద్ర’అనే పోలీస్ డాగ్ గంజాయిని ఎలా గుర్తిస్తుందో ఎస్పీ దగ్గరుండి ఇన్‌చార్జి మంత్రి, ప్రజాప్రతినిధులకు చూపించారు. అయితే, ఆ సమయంలో ప్రజాప్రతినిధులందరూ కూర్చొని ఉండగా, కలెక్టర్ నిల్చొని ఉన్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం అధికార వర్గాలను విస్మయపరిచింది.


