సంతకవిటి:
మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. పగలంతా మండే ఎండ.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు కురిసిన వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. అయితే కురిసిన వర్షానికి పిడుగులు తోడవడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మండలంలోని మిర్తివలస గ్రామానికి చెందిన పాండ్రంకి రామినాయుడు(55) మల్లయ్యపేట పొలాల్లో వరి విత్తనాలు చల్లుతుండగా పిడుగు పడింది. దీంతో ఆ రైతు తన పొలంలోనే మృతి చెందాడు. ఈయనకు భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా ఇంకో కుమార్తెకు వివాహం కావాల్సి ఉంది. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్న కాస్త పొలంను సాగు చేస్తూ జీవిస్తున్న ఈ కుటుంబానికి రామినాయుడు మృతి ఆశనిపాతంగా మారింది. ఇక ఎలా జీవించేదని, తమ కుటుంబానికి దిక్కెవరని రోదిస్తున్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్‌ఐ ఎం.వాసుదేవరావు తెలిపారు.
మామిడిపల్లి పంచాయతీ లింగాపురంలో తాతామనవళ్లు లింగాపురంను ఆనుకుని ఉన్న శ్రీకాకుళం జిల్లా జి.జిగడాం మండలం పెంట గ్రామ పొలాల్లో తమ గొర్రెలను మేతకు తీసుకువెళ్లారు. ఇదే సమయంలో పిడుగు పడింది. దీంతో ఇద్దరూ ఆ ప్రదేశంలో కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో మనవడు కోనారి యుగంధర్(18) అక్కడికక్కడే మృతి చెందాడు. తాత కోనారి అప్పన్న తీవ్రంగా గాయపడడంతో రాజాంలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. యుగంధర్ పదో తరగతి వరకు చదివి ఆర్థిక స్థోమత లేక తమకున్న గొర్రెలను కాపాల కాస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కోనారి రామప్పడు, దుర్గమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం కాకినాడలో పోటీ పరీక్షలకు సమాయత్తమవుతున్నాడు. చిన్న కుమారుడు యుగంధర్ అకాల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికందొచ్చిన కొడుకు పిడుగు పాటుకు గురై మృతి చెందడంతో కుమిలిపోతున్నారు. దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని ఎస్‌ఐ ఆర్.గోపాలరావు తెలిపారు.
జిల్లాలో రెండు రోజుల్లో కురిసిన పిడుగుల వానకు నలుగురు మృత్యువాత పడడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. వర్షం పడితే చాలు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావం ఇలా అకాల వర్షాలకు పిడుగుల వానకు కారణం కావడంతో ప్రజల్లో ఆదోళన నెలకొంది.
కోనారి యుగంధర్, పాండ్రంకి రామినాయుడు మృతదేహాలు
జిల్లాలో కురుస్తున్న పిడుగుల వర్షం ప్రజల ప్రాణాలు తీస్తుంది. దీంతో వర్షం అంటే ప్రజలు భయపడుతున్నారు. కురిసిన వర్షం కంటే పిడుగులు, మెరుపులే ఎక్కువగా ఉండడంతో ఆందోళన
చెందుతున్నారు. పగలంతా మండే
ఎండలతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు సాయంత్రానికి కురిసే
ఓ మోస్తరు వర్షంతో ఉపశమనం
పొందుతున్నారంటే... అదే సమయంలో
పడుతున్న పిడుగులు ప్రాణాలు తీస్తుండడంతో తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. జిల్లాలో శనివారం కురిసిన పిడుగుల వానకు ఇద్దరు మృతి చెందగా.. ఆదివారం సాయంత్రం కురిసిన
పిడుగుల వానకు మరో ఇద్దరు మృతి
చెందారు. వివరాల్లోకి వెళ్తే...


