పేదల బియ్యం పందికొక్కుల్లా..! | - | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం పందికొక్కుల్లా..!

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

పేదల బియ్యం పందికొక్కుల్లా..!

విజయనగరం ఫోర్ట్‌: ఈనెల 6వతేదీన గంట్యాడ మండలం రామభద్రపురంలో పీడీఎస్‌ బియాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా సీఎస్‌డీటీ పట్టుకున్నారు. ఆటోలో ఉన్న 731 కేజీల పీడీఎస్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. పీడీఎస్‌ బియ్యం కొనుగోలు చేసిన ముమ్మిడి శెట్టి నూకరాజుపై 6ఎ కేసు నమోదు చేశారు.

● రాజాం నుంచి పొందూరు వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అందులో ఉన్న 1040 కేజీల పీడీఎస్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. పీడీఎస్‌ బియ్యం విక్రయించిన వెంకటరావు, సురేష్‌, కృష్ణారావులపై కేసులు నమోదు చేశారు.

● గత ఏడాది బొండపల్లి మండలం కొండకిండాం, కిండాం ఆగ్రహారంలో 149 క్వి్‌ంటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. అయితే మొత్తం బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేసిన నార సంచులతోనే అక్రమంగా తరలించడం అప్పట్లో సంచలనమైంది. అయినప్పటికీ నార సంచులతో నేరుగా తరలించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారనే విమర్శలు ఉన్నాయి.

అయితే ఇవి అధికారులు అడపాదడపా చేసిన తనిఖీల్లో పట్టుబడినవి. గుట్టుగా జిల్లాలో పీడీఎస్‌ బియ్యం రాకెట్‌ పెద్ద ఎత్తున జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీఎస్‌ బియ్యం వ్యాపారులకు పచ్చ నేతల అండదండలు ఉన్నాయని సమాచారం. అందుచేతనే జిల్లాలో పీడీఎస్‌ బియ్యం తరలించే వ్యాపారులు జంకూబొంకు లేకుండా ఇష్టారాజ్యం అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలకు అనుకూలంగా ఉన్నవారు పట్టుబడినా వారిని గుట్టుగా విడిపించేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

తూతూమంత్రంగా తనిఖీలు

పీడీఎస్‌ బియ్యం అక్రమ తరలింపును అరికట్టాల్సి న పౌరసరఫరాల శాఖ అధికారులకు ప్రతినెలా వ్యాపారులు వాటాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే తనిఖీలు కూడా తూతుమంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల కళ్ల ముందే పెద్ద ఎత్తున పీడీఎస్‌ బియ్యం తరలిపోతున్నా పట్టించుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పీడీఎస్‌ బియ్యం తరలించే వ్యాపారుల వివరాలు కూడా పౌరసరఫరాల అధికారుల వద్ద ఉన్నప్పటికీ అక్రమ తరలింపు ఆగడం లేదంటే ఏమనుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కన్నెర్ర చేస్తే కచ్చితంగా పీడీఎస్‌ బియ్యం అక్రమ తరలింపునకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయ పడుతున్నారు.

రీసైక్లింగ్‌ చేసి తరలింపు

పీడీఎస్‌ బియ్యాన్ని బియ్యం వ్యాపారులు కొనుగోలు చేసి రైస్‌ మిల్లర్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బియ్యాన్ని వారు రీ సైక్లింగ్‌ చేసి ప్రభుత్వానికే మళ్లీ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం చాలా మంది అధికారులకు కూడా తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో రైస్‌ కార్డులు 5,77,487

జిల్లాలో 1249 రేషన్‌ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో 5,77,487 రైస్‌ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులకు నెలకు సుమారు 8,222 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా అవుతాయి. అందులో నెలకు సుమారు 4 వేల మెట్రిక్‌ టన్నుల వరకు పీడీఎస్‌ బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

టీడీపీ నేతల కనుసన్నల్లో పీడీఎస్‌ బియ్యం దందా

ప్రభుత్వం సరఫరా చేసిన సంచులతోనే పక్కదారి

పట్టుబడిన వారిపై చర్యలు శూన్యం

రెచ్చిపోతున్న బియ్యం వ్యాపారులు

ప్రతినెలా ఆకస్మిక తనిఖీలు

ప్రతినెలా సీఎస్‌డీటీలు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. పీడీఎస్‌ బియ్యంతో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. పీడీఎస్‌ బియ్యం తరలించడం నేరం.

జి.మురళీ నాథ్‌, జిల్లా పౌరసరఫరా అధికారి, విజయనగరం

జిల్లాలోనే అత్యధికంగా బియ్యం దందా

రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కంటే విజయనగరం జిల్లాలోనే రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు దందా ఎక్కువగా జరుగుతోందని సమాచారం. పీడీఎస్‌ బియ్యం కొనుగోలు చేసిన వ్యాపారులు జిల్లా నుంచి విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఒడిశాలోని జిల్లాలకు బియ్యం తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొరుగున ఉన్న విశాఖపట్నం జిల్లాలోని రైస్‌ మిల్లులకు అత్యధికంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement