పార్వతీపురం: యోగాంధ్ర జిల్లాస్థాయి పోటీలను కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించారు. జూనియర్ విభాగం విద్యార్థులకు సోలోయోగా, ప్రాణాయామం, గ్రూప్ యోగా విభాగాల్లో పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి పోటీలకు విజేతలను ఎంపిక చేయనున్నట్లు జిల్లానోడల్ అధికారి డా. టి. జగన్మోహన్‌రావు తెలిపారు. యువతలో యోగా పట్ల ఆశక్తి పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశాల మేరకు జిల్లాస్థాయి యోగాంధ్ర పోటీలను నిర్వహించినట్ల తెలిపారు. కార్యక్రమంలో ఆయుష్‌శాఖ జిల్లా ఇన్‌చార్జ్ అధికారి డా.టి. హేమాక్షి యోగా గురువులు మోహన్ గంతాయత్, కె.జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు.
మహరాజుపేట గాయత్రి స్కూల్ గుర్తింపు రద్దు
పూసపాటిరేగ : భోగాపురం మండలంలోని మహరాజుపేట గాయత్రి ఇంగ్లీషు మీడియం స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడినట్లు ఆ మండల విద్యాశాఖ అధికారి రమణమూర్తి తెలియజేశారు. పాఠశాలను ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వేరే చోటకు మార్పు చేయడంతో విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినందున గుర్తింపు రద్దు చేసినట్లు తెలిపారు. అడ్మిషన్లు, తరగతులు నిలిపివేయాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. పాఠశాలలో ఇప్పటివరకు చదివిన విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలలోను లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాలని తెలియజేశారు. గుర్తింపు లేని పాఠశాలలో విద్యార్థులను చేర్చవద్దని తల్లిదండ్రులకు ఎంఈఓ సూచించారు.
బంగారం మారు తాకట్టు పెట్టి దంపతుల పరారీ
బొబ్బిలి: పట్టణంలోని దావాల వీధి తదితర ప్రాంతాలకు చెందిన ఐదుగురి నగలను ప్రైవేట్ బ్యాంకులో అధిక ధరలకు కుదువ పెట్టి పాత బొబ్బిలికి చెందిన జిల్లెళ్ల ప్రతాప్ అతని భార్య సరోజినిలు పరారయ్యారు. దీంతో బాధితులు బి.సాయికృష్ణ, సొండి లత, కంచెర్ల శ్రీను, శివకుమార్, తులసి తదితరులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రతాప్, సరోజినిలు డబ్బులు అప్పుగా ఇస్తామని సాయికృష్ణ తదితరులకు చెందిన 18గ్రాములు, 30 గ్రాములు, 12 గ్రాములు బంగారం కుదువ పెట్టుకున్నారు. అలాగే ఇతరులు కూడా వారి వద్ద బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బు తీసుకున్నారు. అయితే ఆ దంపతులు కుదువ పెట్టుకున్న బంగారాన్ని ఓ ప్రైవేట్ బ్యాంకులో అధిక డబ్బుకు కుదువ పెట్టి ఆడబ్బుతో పరారయ్యారు. దీంతో ఆ దంపతుల దగ్గర బంగారం కుదువ పెట్టిన వారంతా లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి దంపతుల ఆచూకీ కనుగొని తమ బంగారం తిరిగి ఇప్పించాలని పోలీసులను ఫిర్యాదులో కోరారు.
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
పార్వతీపురం రూరల్: తనకు ప్రమేయం లేని విషయంలో ఇతరులు అనుమానిస్తున్నారనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిన్నింటిరాంనాయుడు వలస గ్రామ శివారులో ఆదివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చందనపల్లి రాము (32) అలియాస్ రవి అనే యువకుడిని గ్రామంలోని ఓ విషయమై కొందరు అనుమానించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రాము గ్రామ శివారులో ఉన్న జీడిమామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి అన్న చందనపల్లి మురళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.


