చాకుతో బెదిరించి బంగారం, డబ్బు దోపిడీ | - | Sakshi
Sakshi News home page

చాకుతో బెదిరించి బంగారం, డబ్బు దోపిడీ

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

చాకుతో బెదిరించి బంగారం, డబ్బు దోపిడీ

కొత్తవలస: తన ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిల్చున్న ఒక వ్యక్తి వద్దకు ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి చాకు, బీరు బాటిల్‌ చూపించి భయపెట్టి ఆ వ్యక్తి జేబులో గల రూ.800 నగదు, చేతికి ఉన్న పావుతులం బంగారు ఉంగరం, సెల్‌ఫోన్‌ దోచుకుని పారిపోతూ పోలీసులు వెంబడిస్తున్నారన్న ఆందోళనలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ప్రధాన నిందితుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు గాయాల పాలయ్యాడు. కొత్తవలస పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై ఎస్సై జోగారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరానికి చెందిన అముజురు శంకర్‌సాయి అనే యువకుడు ఆఫ్టింగ్‌ కార్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో శనివారం రాత్రి వేరొకరికి చెందిన కారులో ప్రయాణికులను అనకాపల్లిలో దింపి అక్కడే కారును వదిలేసి వేరే వ్యాన్‌లో కొత్తవలస వరకు వచ్చాడు. అప్పటికే తెల్లవారుజాము సుమారు 3 గంటలైంది. అక్కడి నుంచి వేరే వాహనం దొరికితే విజయనగరం వెళ్లిపోదామనే ఉద్దేశంతో కొత్తవలస జంక్షన్‌లో వేచి ఉండగా ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి శంకర్‌సాయిని బెదిరించి దోచుకున్నారు. ఇంతలో అటుగా వస్తున్న పోలీసులను చూసి తమను వెంబడిస్తున్నారని భావించి ఆందోళన చెంది ఎస్‌.కోట రూట్‌లో జోరుగా వెళ్తుండగా ఫైర్‌స్టేషన్‌ వద్దకు వెళ్లే సరికి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో స్కూటీ నడుపుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.రోహిత్‌(19) అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న విశాఖపట్నం జిల్లాకు చెందిన గొంప కుమార్‌స్వామి(22) తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు గుర్తించారు.అలాగే ఆటో డ్రైవర్‌ బి.కొండలరావు, అందులో ప్రయాణిస్తున్న ఆయన భార్య చిన్నతల్లికి గాయాలు కావడంతో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన నిందితుడు రోహిత్‌పై విశాఖపట్నం, విజయనగరం,అనకాపల్లి జిల్లాల్లో గల పలు పోలీస్‌స్టేషన్‌లో 8 కేసులు నమోదైనట్లు ఎస్సై తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆటో ఢీకిని ఒక నిందితుడి మృతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement