ఆదుకుంటామన్నారు.. ఆవేదన మిగిల్చారు..! | - | Sakshi
Sakshi News home page

ఆదుకుంటామన్నారు.. ఆవేదన మిగిల్చారు..!

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

ఉత్తుత్తిదిగా మారిన ఉచిత గ్యాస్‌

అధికారంలోకి వస్తే మహిళకు ఏడాదికి మూడు సిలిండర్ల చొప్పు న ఉచితంగా ఇస్తామని చంద్రబాబు సర్కార్‌ గొప్పగా ప్రచారం చేసింది. తీరా పథకాన్ని ఉత్తిగ్యాస్‌గా మార్చేసింది. ఇప్పుడు సిలిండ్‌ అందితే చాలన్న స్థితికి చేర్చింది. ఇప్పటివరకు 30,862 మంది లబ్ధిదారులకు గ్యాస్‌ రాయితీ అందలేదు. మొదట విడతలో 5073 మంది, రెండో విడతలో 2,993 మంది, మూడో విడతలో 4389 మంది, నాలుగో విడతలో 18,407 మందికి కోత విధించింది.

● తల్లికి వందనం లోనూ కోతలే...

గత ప్రభుత్వం అమలుచేసిన అమ్మఒడి పథకానికి టీడీపీ సర్కార్‌ తల్లికి వందనం అని పేరు మార్చింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికివందనం పథకం అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది పథకాన్ని ఎగ్గొట్టింది. జనవరి నెలలో తల్లికి వందనం ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వలేదు. గతేడాది సాంకేతిక సమస్యలు కారణంగా జిల్లాలోని 16 వేల మంది లబ్ధిదారులు తల్లికి వందనం డబ్బులు రాలేదని అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

విజయనగరం ఫోర్ట్‌: ‘అక్కచెల్లెమ్మలూ గుర్తుపెట్టుకోండి... మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మలను లక్షాధికారులను చేసే బాధ్యత మాది’ అంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడుతో పాటు నారా లోకేశ్‌, పవన్‌కల్యాణ్‌, కూటమి నాయకులు ఎన్నికల్లో హామీలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక పథకం ప్రకారం మోసం చేశారు. 18 ఏళ్లు నిండిని ప్రతీ మహిళకు ఆడబిడ్డనిధి కింద నెలకు రూ.1500 ఇస్తామన్న హామీని పూర్తిగా ఎగ్గొట్టారు. జిల్లాలోని 18 ఏళ్లు నుంచి 59 ఏళ్ల వయసు గల సుమారు 7.50 లక్షల మంది మహిళలను మోసం చేశారు. హామీని అమలుచేస్తే ఒక్కో మహిళకు రెండేళ్ల బకాయి నెలకు రూ.1500 చొప్పున రూ.36వేలు చెల్లించాల్సి ఉంది.

ఒక్క రూపాయి ఇవ్వలేదు..

ఎన్నికల ప్రచారంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పన ఇస్తామని చంద్రబాబు చెప్పారు. నా వయసు 26 సంవత్సరాలు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు అయింది. ఇచ్చిన హామీ ప్రకారం రూ.36 వేలు అందాలి. ఒక్క నెల కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇస్తారన్న నమ్మకం కూడా పోయింది. నమ్మించి మోసం చేశారు. – బోను భవాని, లోతు గెడ్డ గ్రామం, మెంటాడ మండలం

సున్నా వడ్డీ రాలేదు

రుణాలు సక్రమంగా కడితే సున్నా వడ్డీ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశారు. తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించినా సున్నా వడ్డీ ఇవ్వలేదు. తీసుకున్న రుణానికి అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తామని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. – గొల్లు రమాదేవి, మధుపాడ గ్రామం, గంట్యాడ మండలం

రెండేళ్లుగా.. ‘ఆడబిడ్డ’ల ఆవేద‘నిధి’..

మహిళలను దగా చేసిన టీడీపీ సర్కార్‌

అమలుకాని ఆడబిడ్డ నిధి

మహిళలకు అందని నెలకు రూ.1500

ఉచిత గ్యాస్‌కు తూచ్‌

డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ హామీ గాలికి...

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement