చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా విజయనగరం జిల్లా కేంద్రంలో చేపట్టిన మహా నిరసన ర్యాలీకి జనం పోటెత్తారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన తెలిపారు. ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వంలో న్యూపూర్ణ కూడలి నుంచి మూడులాంతర్ల కూడలి వరకు సాగిన ర్యాలీలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినదించారు. దగాకోరు పాలనపై ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ బృందం సీఎం చంద్రబాబు మోసకారి పాలనకు వ్యతిరేకంగా, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఆలపింపిచన జానపద గేయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిరసన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ మండలాధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, మాజీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ శెట్టి వీరవెంకట రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, తదితరులు పాల్గొన్నారు.


