రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న నిరంకుశ పాలనలో నలిగిపోతున్నామంటూ రాజాం నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్ ఆధ్వర్యంలో రాజాంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. హామీలను నమ్మి మోసపోయామంటూ వాపోయారు. నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటుకుంటూ మాధవ బజార్‌లోని వైఎస్సార్ విగ్రహం వరకు సాగారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కె.వి.సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు టి.అచ్చియ్యనాయుడు, కార్యదర్శి ఉత్తరావల్లి సురేష్‌ముఖర్జీ, నాలుగు మండలాల పార్టీ కన్వీనర్లు పాల్గొన్నారు.


