స్మార్ట్‌ పోలీసింగ్‌తో మెరుగైన సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ పోలీసింగ్‌తో మెరుగైన సేవలందించాలి

Jun 11 2026 12:19 AM | Updated on Jun 11 2026 12:19 AM

స్మార్ట్‌ పోలీసింగ్‌తో మెరుగైన సేవలందించాలి

● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

విజయనగరం క్రైమ్‌: స్మార్ట్‌ పోలీసింగ్‌తో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ దామోదర్‌ అన్నారు. ఈ మేరకు జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్‌హెచ్‌ఓలతో బుధవారం జిల్లాపోలీస్‌ కార్యాలయంలో ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్యాప్తులో ఉన్న లాంగ్‌ పెండింగ్‌, గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌, ఎన్‌డీపీఎస్‌, పోక్సో, అట్రాసిటీ, మిస్సింగ్‌, చోరీ, రోడ్డు ప్రమాద, సోషల్‌ మీడియా కేసులను సమీక్షించి, అధికారులకు దర్యాప్తుపరమైన పలు సూచనలు చేసి, దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందించిన 360 డిగ్రీ మొబైల్‌ యాప్‌ లో మిస్సింగ్‌, ఓవీ క్రిమినల్స్‌, పోయిన వాహనాల ఫొటోలను అప్‌లోడ్‌ చేసి, ఫేస్‌ రికగ్నైజింగ్‌ కెమెరాలతో వచ్చిన అలెర్ట్‌ మెసేజ్‌ లకు తక్షణమే స్పందించి మిస్సింగ్‌, ఓవీ క్రిమినల్స్‌, పోయిన వాహనాల ఆచూకీని కనుగొనాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.

సీసీ కెమెరాల వినియోగం పెంచాలి

క్షేత్రస్థాయిలో సాంకేతికతను, డ్రోనన్స్‌, సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత పెంచి, నేరాలను నియంత్రించాలన్నారు. మహిళల భద్రత, గంజాయి, రహదారి భద్రత, సైబర్‌ భద్రత పట్ల ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో మహిళా సంరక్షణ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. చోరీ వస్తువులు, బంగారు ఆభరణాలను వ్యాపారులు కొనుగోలు చేయకుండా చర్యలు చేపట్టాలని, పాత బంగారు వస్తువులు కొనుగోలు చేసేందుకు బంగారు వ్యాపారులు ప్రత్యేకంగా ఒక రికార్డులో కొనుగోలు చేసే వస్తువుల వివరాలను నమోదు చేయాలన్నారు. ఏవైనా నేరాలు జరిగినప్పుడు నేర స్థలం నుంచి ఆధారాల సేకరణకు తప్పనిసరిగా క్లూస్‌ టీం సహాయం తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ నివేదికలను సంబంధిత కార్యాలయాల నుంచి త్వరితగతిన పొందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా పెట్టాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నేరాలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్‌.గోవిందరావు, ఎస్‌.రాఘవులు, ఎం.వీరకుమార్‌, డీటీపీసీ డీఎస్పీ నారాయణరావు, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement