● రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం
● తల్లికి గాయాలు
శృంగవరపుకోట: పేగుతెంచి జన్మనిచ్చిన తల్లి తన చిన్నారి బిడ్డను తాను చూస్తుండగానే కోల్పోవడంతో ఆ తల్లి పేగు తల్లడిల్లిపోయింది. ఈ ప్రమాద ఘటన ఆ తల్లి కడుపు తరుక్కుపోయేలా చేసింది. అప్పటి వరకూ ఆడిపాడిన చిన్నారిని తల్లిదండ్రులు చూస్తుండగానే మృత్యువు తన ఒడిలోకి లాక్కుపోయింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన తోనంగి రామదాసు–కుసుమలు తమ రెండవ కుమార్తె భారతిని విశాఖ జిల్లా, పద్మనాభం మండలం, చిన్నాపురం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి కడుభట్ల రాంబాబుకు ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. ఇటీవల రాంబాబు ఆర్మీ నుంచి రిటైర్ అయి గ్రామంలోనే ఉంటున్నారు. వారికి ఐదేళ్ల రిత్విక్‌రోషన్, పదకొండు నెలల చిన్నారి కౌశిక్‌లు ఉన్నారు. రాంబాబు భార్యాబిడ్డలతో ఆదివారం కృష్ణాపురంలో గ్రామదేవత మొక్కు తీర్చుకునేందుకు అత్తారింటికి వచ్చారు. గ్రామంలో మొక్కులు తీర్చుకున్న దంపతులు గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సీతంపేట గ్రామంలోని బండెమ్మ అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి పల్సర్‌బైక్‌పై పిల్లలతో బయల్దేరారు. ఆలయానికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న రిగ్‌బోరు లారీని తప్పించే క్రమంలో బైక్ రోడ్డు పక్క ఉన్న చిన్న గుంతలో పడి అదుపుతప్పి స్కిడ్ అయ్యింది. దీంతో బైక్‌పై వెనుక చిన్నకొడుకు కౌశిక్‌ను ఎత్తుకుని కూర్చున్న భారతి కింద పడిపోయింది. ఆమె చేతిలో నుంచి చిన్నారి కౌశిక్ తూలిపోయాడు. భారతి కుడి చేయి లారీ టైర్ కింద పడి ఫ్రాక్చర్ అయ్యింది. కింద పడి స్వల్ప గాయాలపాలైన కౌశిక్ స్పృహ కోల్పోయాడు. దీంతో హుటాహుటిన స్థానికుల సహాయంతో తల్లీ బిడ్డలను ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే చిన్నారి కౌశిక్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భారతి చేతికి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. కాగా చిన్నారి కౌశిక్ మరణం గ్రామంలో విషాదం నింపింది. తమ బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనతో ఆస్పత్రి వాతావరణం గంభీరంగా మారిపోయింది. ముక్చుపచ్చలారని ముద్దులొలికే చిన్నారి మృతదేహాన్ని పట్టుకుని కుటుంబసభ్యులు ఏడుస్తున్న తీరు చూపరుల కళ్లు చెమర్చేలా చేసింది.


